ముఖ్యాంశాలు
పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం రూ. 529.38 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్లో దాదాపు రూ. 287 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో అభ్యర్థులకు రూ. 58.80 కోట్లు అందించింది.
ఎన్నికల సమయంలో పార్టీకి సుమారు రూ. 1,494 కోట్ల ఆదాయం సమకూరింది
ఎన్నికల ముగింపు సమయానికి రూ. 7,689.06 కోట్ల నిల్వ ఉన్నట్లు తెలిపిన బీజేపీ
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్కు సమర్పించిన వ్యయ నివేదికల ప్రకారం… మే నెలలో ముగిసిన ఐదు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రూ. 529.38 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమిటంటే ఇందులో సగానికి పైగా మొత్తం పశ్చిమ బెంగాల్లోనే ఖర్చయింది; అక్కడ బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది అని ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ పేర్కొంది.
పార్టీ బెంగాల్ వ్యయం దాదాపు రూ. 287 కోట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో రూ. 217.16 కోట్లు సాధారణ ప్రచారం కోసం, రూ. 69.83 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చయ్యాయి. అభ్యర్థుల కోసం ఖర్చయిన మొత్తంలో, నేరుగా వారికి అందించిన రూ. 58.80 కోట్లు కూడా ఉన్నాయి.
తర్వాతి స్థానంలో అస్సాం (రూ. 96.26 కోట్లు) నిలవగా, ఆ తర్వాత కేరళ (రూ. 82.67 కోట్లు), తమిళనాడు (రూ. 51.56 కోట్లు) ఉన్నాయి. పుదుచ్చేరిలో రూ. 11.89 కోట్లు ఖర్చు చేసినట్లు పార్టీ తెలిపింది.
ఎన్నికల సమయంలో బీజేపీకి సుమారు రూ. 1,494 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బు, చేతిలో ఉన్న నగదుతో కలిపి పార్టీ వద్ద మొత్తం రూ. 7,689.06 కోట్ల నిల్వ ఉంది.
ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలనే దానిపై పరిమితులు ఉంటాయి, కానీ రాజకీయ పార్టీలకు మొత్తం వ్యయంపై ఎటువంటి పరిమితి లేదు. ఎన్నికల తర్వాత ప్రయాణం, ర్యాలీలు, ప్రకటనలు, ప్రచార సామగ్రి వంటి ఖర్చుల వివరాలతో కూడిన లెక్కలను పార్టీలు సమర్పించాల్సి ఉంటుంది.


