Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రెస్‌నోట్‌…నివృత్తి కాని సందేహాలు ఎన్నో?!

Share It:

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 26న కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పత్రికా ప్రకటన అనేక పరిపాలనా పరమైన సంస్కరణలను తెరపైకి తెచ్చినప్పటికీ, అప్పటికే ఉన్న వివాదాలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా సరికొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇళ్ల వద్దకే వెళ్లడం, అణగారిన వర్గాల కోసం ప్రత్యేక శిబిరాలు, ECINet వ్యవస్థపై నిపుణుల సమీక్ష, కచ్చితమైన అజెండాలు, మీటింగ్ మినిట్స్ వంటివి పైకి ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. కానీ ఇవి నిజమైన సంస్కరణలా.. లేక ఇంతకాలం పక్కనపెట్టి, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ అమలు చేస్తున్న కనీస బాధ్యతలా అన్నదే అసలు ప్రశ్న.

పత్రాల భారం అలాగే ఉంది
ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ నోటీసులు అందుకున్నవారు ఇకపై ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, బీఎల్‌ఓలే ఇళ్లకు వెళ్లి పత్రాలు సేకరిస్తారని ఈసీ చెప్పింది. ఇది కొంత ఉపశమనం కలిగించినా, అసలు సమస్యను పరిష్కరించదు. పత్రాలు సమర్పించాలనే భారం ఓటరుపై అలాగే ఉంటుంది. నిరాశ్రయుల కోసం శిబిరాలు ఏర్పాటు చేసినా, వారి వద్ద సరైన పత్రాలు ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ ప్రక్రియ అందరినీ కలుపుకుపోయేలా ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందనేది ప్రశ్నార్థకమే. ఢిల్లీలో విచక్షణా రహితంగా జారీ చేసిన నోటీసుల వ్యవహారంపై సాక్షాత్తూ సుప్రీంకోర్టే వివరణ కోరడం ఇక్కడ గమనార్హం.

చట్టాన్ని శాసిస్తున్న సాంకేతికత: గోవా ఉదాహరణ
చట్టబద్ధమైన అధికారుల కంటే సాంకేతికతకే (సాఫ్ట్‌వేర్) ఎక్కువ ఆధిపత్యం ఇవ్వడం ఇక్కడ అత్యంత తీవ్రమైన సమస్య. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సెక్షన్ 13బి ప్రకారం ఓటర్ల జాబితా సవరణ అధికారం ఈఆర్ఓలదే. గోవాలో 97 మంది ఓటర్లు అర్హులేనని ఈఆర్ఓలు నిర్ధారించినప్పటికీ, ఢిల్లీ నుంచి నియంత్రించే ECINet సాఫ్ట్‌వేర్ వారి పేర్లను తిరిగి చేర్చే అవకాశాన్ని (రోల్‌బ్యాక్) అడ్డుకుంది. దీనిపై స్థానిక అధికారులు పదేపదే లేఖలు రాసినా ఫలితం దక్కలేదు. చట్టబద్ధమైన అధికారి నిర్ణయాన్ని ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎలా వీటో చేస్తుంది? దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడేసిన తర్వాత, ఇప్పుడు దాని చట్టబద్ధతను పరిశీలించడానికి ‘నిపుణుల కమిటీ’ వేస్తామని చెప్పడం కేవలం నష్టనివారణ చర్య మాత్రమే.

ఫారం-6 మార్పులు
ఫారం-6కు సంబంధించిన వివాదం కూడా ఇలాంటిదే. ఫారంలో మార్పులు చేయలేదని, కేవలం ఒక డిక్లరేషన్‌ను అదనంగా చేర్చామని ఈసీ చెబుతోంది. కానీ, ఆన్‌లైన్ ప్రక్రియలో ‘తల్లిదండ్రుల వివరాలను తప్పనిసరి’ చేస్తూ నిబంధనలు ఎవరు మార్చారన్నది అస్పష్టం. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (సంధు, జోషి) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ఈ డిజిటల్ మార్పులను ఎవరు, ఏ అధికారంతో అమలు చేశారో ఈసీ వివరించలేదు.

కమిషన్ సమావేశాలకు ముందు అజెండా ఇవ్వడం, తర్వాత మినిట్స్ పంపిణీ చేయడం, కమిషనర్ల ఆదేశాలను కచ్చితంగా పాటించడం ఇకపై జరుగుతాయని తాజా ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఇన్ని రోజులు ఈ విధానం ఎందుకు అమలు కాలేదు? పది నెలల కాలంలో కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో.. గతంలో వారు ఇచ్చిన ఆదేశాల పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఈసీపై ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది అప్పీళ్లు ఎవరివి?
పశ్చిమ బెంగాల్‌లో దాఖలైన 38.31 లక్షల అప్పీళ్ల వ్యవహారం మరింత అనుమానాస్పదంగా ఉంది. ఏకంగా ఈసీ పేరుతోనే (ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈసీ) ఈ అప్పీళ్లను ఎవరు దాఖలు చేశారు? ఓటర్ల చేరికలను సవాల్ చేస్తూ పేర్లను ఎవరు అందించారు? అన్న ప్రశ్నలకు జవాబులు లేవు. వీటి పూర్తి వివరాలు బయటపెట్టడం అత్యవసరం.

ఎన్నికల సంఘం చేపట్టిన తాజా దిద్దుబాటు చర్యలు ఆహ్వానించదగ్గవే అయినా.. అవి గతంలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను పరోక్షంగా అంగీకరిస్తున్నాయే తప్ప, సరైన వివరణను ఇవ్వడం లేదు. సాంకేతికత ఎల్లప్పుడూ చట్టానికి లోబడి పనిచేయాలి కానీ, అదే చట్టంగా మారకూడదు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నదెవరు? సాఫ్ట్‌వేర్ ఈఆర్ఓను ఎందుకు అడ్డుకోగలిగింది? అనే ప్రాథమిక ప్రశ్నలను ఫైళ్లలో తొక్కిపెట్టకుండా వాస్తవాలను పారదర్శకంగా వెల్లడించినప్పుడే.. రేపటి వ్యవస్థల మీద మాత్రమే కాకుండా, నిన్నటి ఈసీ పనితీరుపై కూడా ప్రజల్లో సంస్థాగత విశ్వాసం నిలబడుతుంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.