Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఓట్‌ చోరీతో మోదీ, షా ఇండియానే హైజాక్‌ చేశారు…రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు!

Share It:

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌లు ‘ఓటు దొంగతనం’ ద్వారా దేశాన్ని ‘హైజాక్’ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిని ఆయన ‘దేశద్రోహం’గా అభివర్ణించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరూ జవాబుదారీతనం నుండి తప్పించుకోలేరని అన్నారు.

ఎన్నికల సంఘం కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీలు మార్చ్ చేయకుండా అడ్డుకున్న అనంతరం, రాహుల్‌ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ… “బీజేపీ చెప్పేదానిపై నాకు ఆసక్తి లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నాతో పాటు 300 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు వచ్చారు, వారు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నారని” లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు అన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సహకారంతో మోదీ, షా, భగవత్‌లు ‘ఓటు దొంగతనం’ ద్వారా ‘ప్రజాస్వామ్యాన్ని అంతం చేశారని’ గాంధీ ఆరోపించారు.
“వారిపై చర్య ఉంటుంది. ప్రధాని మోదీ, హోం మంత్రి షా, ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి భగవత్, లేదా సీఈసీ జ్ఞానేష్ కుమార్ – వీరిలో ఎవరినీ వదిలిపెట్టరు. మన దేశానికి వీరు దేశద్రోహం చేశారు. ఎవరూ తప్పించుకోలేరు,” అని ఆయన అన్నారు.

“మేము కోట్లాది మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము. ఎన్నికల కమిషనర్లు మమ్మల్ని ఎందుకు కలవడం లేదు? పోలీసులు మమ్మల్ని ఎందుకు ఆపి బెదిరిస్తున్నారు?” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

“వారు మమ్మల్ని కలవాల్సిందే. ఎంపీలను అవమానించారు. మేము ఏ తప్పూ చేయలేదు. మేము ఎన్నికల కమిషనర్ల వద్దకు వెళ్లి వారిని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము, వారు ఓటు దొంగతనం చేశారని చెప్పాలనుకుంటున్నాము,” అని ఆయన అన్నారు. అయితే, సమావేశం కోసం ఏ రాజకీయ పార్టీ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ నిరసన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోందని, అసౌకర్యానికి కారణమవుతోందన్న విమర్శలను కూడా రాహుల్‌ గాంధీ తోసిపుచ్చారు. నిరసన వల్ల అంతరాయం కలుగుతోందని పోలీసులు భావిస్తే, ప్రతిపక్షాలు ధర్నా చేయడానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తున్నారని ఆరోపించిన వారిని ఉద్దేశించి, “వారు చేసింది దేశద్రోహం, మేము వారిని నాశనం చేయబోతున్నాం” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

కాగా, పార్లమెంట్ వీధి నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపుగా ఇండియా బ్లాక్ నిర్వహించిన మార్చ్ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. పార్లమెంట్ వీధిలో పోలీసులు మార్చ్‌ను అడ్డుకోవడంతో గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు ఇతర నాయకులు ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నాయి.

మార్చ్ ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరకుండా నిరోధించడానికి పార్లమెంట్ వీధి, ఇతర రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓ’బ్రియన్‌తో సహా పలువురు ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హూడా, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పవన్ ఖేరా, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ప్రణితీ షిండే ఉన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.