సయ్యద్ ఖాలిఖ్ అహమ్మద్…✍️
న్యూఢిల్లీ: నీట్ (జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష) పరీక్ష పత్రాలు లీకయ్యాయన్న ఆరోపణలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఆందోళనలను ప్రపంచం ఆసక్తిగా గమనించింది. నీట్ కేసులో విజయం సాధించిన తర్వాత, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) నెపంతో 13 కోట్ల మంది ఓటర్లను జాబితాల నుండి తొలగించినందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ నాయకులు మరో ప్రదర్శన ప్రారంభించారు. అయితే, మైనారిటీ సంస్థలుగా పనిచేస్తున్న అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ), జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ)లలో ఎన్నికైన విద్యార్థి సంఘాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు మాత్రం చాలా వరకు ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు.
బహుశా, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై మీడియా అధికంగా దృష్టి సారించడమే, AMU, JMI లలో జరిగిన ఆందోళనలు తగినంత దృష్టిని ఎందుకు ఆకర్షించలేకపోయాయో వివరిస్తుంది. విచిత్రమేమిటంటే, ఈ రెండు విశ్వవిద్యాలయాల నిరసనలు దాదాపు మన సమీపంలోనే జరిగాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా తమ దృష్టిని కేంద్రీకరించిన జంతర్ మంతర్‌కు JMI కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండగా, AMU సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ, ప్రజా నిరసనలకు పేరుగాంచిన ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్నప్పటికీ, ఈ రెండు విశ్వవిద్యాలయాలలోని విద్యార్థుల డిమాండ్లు జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రదర్శనల కారణంగా చాలా వరకు మరుగున పడిపోయాయి.
ఆశ్చర్యకరంగా, ఢిల్లీలోని రెండు కేంద్ర విశ్వవిద్యాలయాలైన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU), ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU)లలో విద్యార్థి సంఘ ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతుండగా, కేంద్ర విశ్వవిద్యాలయాలుగా ఉన్న రెండు మైనారిటీ సంస్థలలో విద్యార్థి సంఘ ఎన్నికలు సంవత్సరాలుగా నిలిపివేశారు. 2018 నుండి AMUలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగలేదు.
ఇక JMIలో 2006 నుండి ఎన్నికైన విద్యార్థి సంఘం లేదు. 2006లో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేమ్స్ మైఖేల్ లింగ్డో నేతృత్వంలోని లింగ్డో కమిటీ, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎటువంటి సాకులు చెప్పకుండా వార్షిక విద్యార్థి సంఘ ఎన్నికలను సిఫార్సు చేసినప్పటికీ ఈ పరిస్థితి నెలకొంది.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి, SIR ముసుగులో ఓటర్ల తొలగింపునకు వ్యతిరేకంగా సీజేపీ నేతృత్వంలో జరిగిన యువజన ఉద్యమం ఈ రెండు మైనారిటీ సంస్థలలోని విద్యార్థుల నిరసనలకు ప్రేరణగా నిలిచి ఉండవచ్చు. అయితే, AMUలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఛార్జీల పెరుగుదలతో విద్యార్థుల్లో అసంతృప్తికి కారణమైంది ; ఇక జామియా మిలియాలో ఫీజుల పెంపుతో పాటు, వాష్‌రూమ్‌లు, తరగతి గదులు, లైబ్రరీలు, తాగునీటి వంటి అధ్వాన్నమైన సౌకర్యాలు విద్యార్థుల ఉద్యమానికి నిప్పురవ్వగా మారాయి.
అలీఘర్, జామియా మిలియా విద్యార్థి సంఘాల ఎన్నికల కోసం పోరాటం
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU), జామియా మిలియా ఇస్లామియా (JMI) వంటి ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో భాగంగా ‘విద్యార్థి సంఘం ఎన్నికల’ కోసం జరుగుతున్న పోరాటాలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
AMUలో నిరసనలు, అణచివేత (2024 – 2025)
AMU విద్యార్థులు గతంలో ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అంతేకాకుండా, 2024, 2025 సంవత్సరాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ,పరిపాలనా ఒత్తిళ్లు
కాగా, ఏప్రిల్ 2024 నుండి AMU వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ నైమా ఖాతూన్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆమెకు ముందు వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, MLC గా కొనసాగుతుండటం గమనార్హం. కేంద్ర విశ్వవిద్యాలయాలపై అధికారంలో ఉన్న పార్టీల ప్రభావం ఉంటుందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
భారీ నిరసనలు – పోలీసుల జోక్యం
ఇక 2024లో వైస్-ఛాన్సలర్ నివాసం వద్ద విద్యార్థులు ధర్నాలు చేపట్టగా, పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఆగస్టు 2025లో ట్యూషన్ ఫీజు 36 శాతం పెంచడంతో పెద్ద ఘర్షణ చెలరేగింది. బాబ్-ఎ-సయ్యద్ గేటు వద్ద ప్రార్థనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, దురుసుగా ప్రవర్తించారు.
మహిళా విద్యార్థుల నిరసనలు
అలాగే 2025 ఏప్రిల్‌లో అబ్దుల్లా హాల్లో దీర్ఘకాలిక విద్యుత్ కోతలు, నీటి కొరతకు వ్యతిరేకంగా మహిళా విద్యార్థులు ఆందోళన చేపట్టగా, ప్రొక్టోరియల్ సిబ్బంది తమ పట్ల నిరంకుశంగా వ్యవహరించారని ఆరోపించారు.
సెప్టెంబర్‌లో భారీ ఉద్యమం, యాసిర్ ఫహద్ నిరాహార దీక్ష
సెప్టెంబర్ 2026లో హాస్టల్ మెస్‌లో వడ్డించిన అపరిశుభ్రమైన ఆహారంలో పురుగులు, కీటకాలు, గాజు ముక్కలు, మేకులు వంటి ప్రమాదకర వస్తువులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున భగ్గుమన్నారు. దీంతో విద్యార్థి సంఘ ఎన్నికలు, విశ్వవిద్యాలయ ప్రొక్టర్ తొలగింపు ప్రధాన డిమాండ్‌గా ఉద్యమం ఊపందుకుంది.
SIO మద్దతుతో బలపడిన ఉద్యమం
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) AMU విభాగానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి…యాసిర్ ఫహద్ సెప్టెంబర్ 21న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మునుపటి ఆందోళనలా కాకుండా ఈసారి SIO వంటి వ్యవస్థీకృత నెట్వర్క్ తోడు కావడంతో పరిపాలన యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. యాసిర్ ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 7న అంబులెన్స్‌తో వచ్చిన సిబ్బందిని విద్యార్థులు అడ్డుకున్నారు.
విద్యార్థుల పట్టుదల ఫలితంగా వీసీ ప్రొఫెసర్ నైమా ఖాతూన్‌తో చర్చలు ఫలించాయి. అక్టోబర్ 9న వీసీ స్వయంగా నిరసన ప్రాంతాన్ని సందర్శించి, యాసిర్‌కు జ్యూస్ అందించి దీక్ష విరమింపజేశారు. అంతేకాదు విశ్వవిద్యాలయ ప్రోక్టర్ మహమ్మద్ నవీద్ ఖాన్ స్థానంలో ప్రొఫెసర్ నఫీస్ అహ్మద్ అన్సారీని నియమించారు. నవంబర్ 5న విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని అధికారికంగా ప్రకటించారు.
జామియా మిలియాలోనూ వ్యక్తమవుతున్న నిరసనలు
AMU విద్యార్థుల విజయం JMI విద్యార్థులకు పెద్ద ప్రేరణనిచ్చింది. 2006 నుండి జేఎంఐలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు (చివరి ఎన్నికలు 2005లో జరిగాయి). హింసను సాకుగా చూపి 2006 మార్చి 31న నాటి యూనియన్ను రద్దు చేశారు.
ఫలితంగా జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్ (JMISU) ఎన్నికలు జరపాలని కోరుతూ అక్టోబర్ 12న విద్యార్థులు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎస్ఐఓ, ఎన్ఎస్యూఐ, ఫ్రాటర్నిటీ మూవ్మెంట్ వంటి సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. దీంతో ఆందోళనను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులను రంగంలోకి దించడంతో విద్యార్థులపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. AMU విద్యార్థులు సైతం జామియాకు వెళ్లి సంఘీభావం తెలిపారు.
JMI కమిటీ ఏర్పాటు, ఆగని విద్యార్థుల ఆందోళన
పూర్వ విద్యార్థులు, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో JMI పాలక కమిటీ అక్టోబర్ 21న సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ జుబేర్ మీనాయ్ అధ్యక్షతన ఒక ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 2026 డిసెంబర్ 20లోగా రాజ్యాంగ ముసాయిదాను సమర్పించాలని ఆదేశించింది. కాగా, ఈ కమిటీలో విద్యార్థి ప్రతినిధి ఎవరూ లేకపోవడం, రెండు నెలల సమయం కేటాయించడం వంటివి కాలయాపన ఎత్తుగడలుగా విద్యార్థులు భావిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు బదులుగా ‘నామినేషన్ ఆధారిత ప్రాతినిధ్యం’ తెస్తారేమోనన్న అనుమానాలతో జాసిం అలీ ఖాన్, ఎబిన్ బాసిల్, రెహాన్ హైదర్, రెహాన్ ఖాన్ తదితరులు తమ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.
మొత్తంగా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU), జామియా మిలియా ఇస్లామియా (JMI) అనేవి కేవలం విద్యా సంస్థలు మాత్రమే కావు; అవి చారిత్రకంగా ముస్లిం రాజకీయ చైతన్యాన్ని, నాయకత్వాన్ని పెంపొందించే వేదికలు. ప్రస్తుత కాలంలో ముస్లిం రాజకీయ ప్రాతినిధ్యంపై అణచివేతలు పెరుగుతున్న తరుణంలో, సంఘటితంగా నిలబడి నాయకత్వాన్ని ఎన్నుకునే హక్కును సాధించుకోవడం విద్యార్థులకు అత్యంత అవసరమని ఈ ఉద్యమాలు నిరూపిస్తున్నాయి.
