ముఖ్యాంశాలు
ఘనంగా ముగిసిన ‘బియాండ్ ద డివైడ్’ ఎక్స్‌పో..
ద్వేషంపై మానవత్వం విజయం.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు.
ముస్లిం పాలకుల చరిత్రపై అపోహలకు తెర..ఇస్లాం మానవీయ సందేశంపై అవగాహన..
భారతదేశ అభివృద్ధిలో ముస్లింల అపారమైన కృషికి చారిత్రక ఆధారాల ప్రదర్శన
హైదరాబాద్: అపోహాలపై వాస్తవాల విజయం.. విద్వేషాలపై మానవత్వం విజయం.. విభజనలపై సహజీవన సందేశం! చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తూ, మతాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందిస్తూ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ‘బియాండ్ ద డివైడ్ – కౌంటరింగ్ హేట్, బిల్డింగ్ హార్మనీ’ ఎక్స్‌పో దిగ్విజయంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, యువత, జెన్-జీ తరం విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించడం విశేషం.
జమాఅతె ఇస్లామీ హింద్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న ప్రదర్శన కేవలం ఒక ఎగ్జిబిషన్‌గా కాకుండా చరిత్రను పునఃపరిశీలించే, అపోహలను ప్రశ్నించే, వాస్తవాలను తెలుసుకునే విజ్ఞాన వేదికగా నిలిచింది. కులమతాలకు అతీతంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ప్రదర్శనను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన చారిత్రక ఆధారాలు, సమాచార ప్యానెళ్లు, ఇంటరాక్టివ్ నమూనాలు, 3డీ హోలోగ్రామ్ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.
ముస్లిం పాలకుల చరిత్రపై కొత్త అవగాహన! భారతదేశ చరిత్రలో ముస్లిం పాలకుల పాత్రను కేవలం యుద్ధాలు, ఘర్షణలు, రాజకీయ సంఘర్షణల కోణంలోనే చూడకూడదనే సందేశాన్ని ఈ ఎక్స్‌పో బలంగా చాటిచెప్పింది. ఆనాటి రాజకీయ పరిస్థితులు, అధికార పోరాటాలు, పరిపాలనా విధానాలు, కళలు, నిర్మాణ రంగం, విద్య, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధిలో ముస్లిం పాలకులు, పండితులు, కళాకారులు అందించిన సేవలను చారిత్రక ఆధారాలతో పరిచయం చేశారు.భారతదేశ నిర్మాణం, అభివృద్ధి, సంస్కృతి, నాగరికతల వికాసంలో ముస్లింలు అందించిన కృషి దేశ ఉమ్మడి వారసత్వంలో అంతర్భాగమనే విషయాన్ని ఈ ప్రదర్శన సందర్శకులకు గుర్తుచేసింది. చరిత్రపై ఏకపక్ష కథనాలకే పరిమితం కాకుండా, వాస్తవాలను విస్తృత దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరాన్ని తెలియజేసింది.
ఇస్లాంపై అపార్థాలకు సమాధానాలు…ఇస్లాం, జిహాద్, ఉగ్రవాదం, మహిళల హక్కులు, మత సామరస్యం వంటి అంశాలపై సమాజంలో ప్రచారంలో ఉన్న అపోహలను ప్రశ్నిస్తూ ఇస్లాం అసలు బోధనలను వివరించడం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, కరుణ, న్యాయం, సేవ, సమానత్వం, మానవ గౌరవం వంటి విలువలకు ఇస్లాం ఇచ్చే ప్రాధాన్యతను వివిధ ప్రదర్శనల ద్వారా వివరించారు.‘లవ్ జిహాద్’, ‘పాపులేషన్ జిహాద్’ వంటి పదాల చుట్టూ ప్రచారంలో ఉన్న వాదనలు, అపోహలను సందర్శకులు స్వయంగా పరిశీలించి ప్రశ్నించేలా ఇంటరాక్టివ్ ఏర్పాట్లు చేశారు. 3డీ హోలోగ్రామ్ ద్వారా ప్రదర్శించిన మూడు హృద్యమైన కథలు మతాలకు అతీతంగా మానవత్వం, పరస్పర సహకారం, సోదరభావం ఎంత విలువైనవో చాటిచెప్పాయి.
విభేదాల మధ్య సంభాషణకు వేదిక…ఈ ఎక్స్‌పోలో కనిపించిన మరో విశేషం వివిధ వయసులు, సామాజిక నేపథ్యాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం. మహిళలు, యువత, విద్యార్థులు ప్రదర్శనలోని అంశాలపై ఆసక్తిగా చర్చిస్తూ, సందేహాలను నివృత్తి చేసుకుంటూ కనిపించారు. ముఖ్యంగా యువతలో చరిత్రను తెలుసుకోవాలనే ఆసక్తిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది.ఇతరుల అభిప్రాయాల ఆధారంగా ఒక సమాజాన్ని అంచనా వేయకుండా, స్వయంగా తెలుసుకోవడం, ప్రశ్నించడం, చారిత్రక ఆధారాలను పరిశీలించడం ద్వారా సరైన అవగాహనకు రావాలనే సందేశం ఈ ప్రదర్శన ద్వారా ప్రజల్లోకి వెళ్లింది.
విడిపోవడానికి కాదు.. కలిసుండటానికి చరిత్ర… నేటి సమాజంలో మతం, కులం పేరుతో పెరుగుతున్న విభేదాలు, అపోహలు, పరస్పర అపనమ్మకాల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాల అవసరం మరింత ఉందని ఈ ఎక్స్‌పో నిరూపించింది. భిన్నత్వమే భారతదేశ బలమని, దేశ చరిత్ర ఏ ఒక్క సమాజానికో పరిమితం కాదని, తరతరాలుగా వివిధ మతాలు, సంస్కృతులు, సమాజాల భాగస్వామ్యంతోనే భారతీయ నాగరికత రూపుదిద్దుకుందని ఈ ప్రదర్శన చాటిచెప్పింది.
మూడు రోజులపాటు సాగిన ఈ విజ్ఞాన, చారిత్రక ప్రస్థానం సందర్శకుల నుంచి విశేష స్పందనను అందుకుని విజయవంతంగా ముగిసింది. ద్వేషాన్ని ప్రశ్నించి, అపోహలను తొలగించి, పరస్పర గౌరవం, విశ్వాసం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్ని ‘బియాండ్ ద డివైడ్’ ఎక్స్‌పో బలంగా వినిపించింది.**ఎందుకంటే చరిత్ర అనేది గతాన్ని గుర్తుచేసుకోవడానికే కాదు.. వర్తమానాన్ని అర్థం చేసుకుని, భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా! మనుషులను విడదీసే గోడలు కాదు.. మనసులను కలిపే వారధులే భారతదేశ అసలైన వారసత్వం!
ప్రముఖుల సందేశం… ఎక్స్‌పో ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జమాఅతె ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ సలీమ్ ఇంజినీర్, తెలంగాణ అధ్యక్షుడు మహమ్మద్ అజరుద్దీన్, ఉపాధ్యక్షుడు జనాబ్ సాదిక్ అహ్మద్, జమాఅతె ఇస్లామీ హింద్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు డాక్టర్ ముబాషిర్ అహ్మద్, ఆకునూరి మురళి తదితరులు మాట్లాడారు. సమాజంలో మత సామరస్యం, పరస్పర అవగాహన, రాజ్యాంగ విలువలు, సహజీవన స్ఫూర్తిని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాధాన్యతను ఈ ముగింపు సభ ప్రతిబింబించటం విశేషం.


