మానవత్వమే మతాల ఉమ్మడి సందేశం!,
ప్రేమ, కరుణ, సేవ, సహజీవన విలువలతోనే సమాజంలో శాంతి సాధ్యం
హైదరాబాద్, అక్టోబరు 31: మతం మనుషులను విడదీయడానికి కాదు.. మానవత్వంతో ఒక్కటి చేయడానికి! విశ్వాసాల మధ్య గోడలు కట్టడం కాదు.. పరస్పర గౌరవంతో వారధులు నిర్మించడమే నిజమైన మతసారం!! మతం పేరుతో పెరుగుతున్న విద్వేషాలు, అపోహలకు తెరదించుతూ.. ప్రేమ, కరుణ, సేవ, న్యాయం, సహజీవన విలువలను సమాజానికి చాటిచెప్పే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ‘బియాండ్ ది డివైడ్’ వేదికపై భిన్న మతాల ఆధ్యాత్మిక, సామాజిక ప్రముఖులు ఒక్కటయ్యారు. విద్వేషాలకు సంభాషణ, అపార్థాలకు అవగాహన, విభేదాలకు పరస్పర గౌరవమే సమాధానమని సర్వమత సదస్సు చాటిచెప్పింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జమాఅతె ఇస్లామీ హింద్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బియాండ్ ది డివైడ్ – కౌంటరింగ్ హేట్, బిల్డింగ్ హార్మనీ’ ప్రదర్శనలో భాగంగా శనివారం సాయంత్రం ప్రత్యేక సర్వమత సదస్సు జరిగింది. వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులు, మత పెద్దలు, సామాజిక రంగ ప్రముఖులు ఒకే వేదికను పంచుకొని మత సామరస్యం, జాతీయ సమైక్యత, పరస్పర అవగాహన ఆవశ్యకతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
భిన్నత్వమే భారతదేశ బలం…భారతదేశ చరిత్ర, సంస్కృతి భిన్న మతాలు, భాషలు, సంప్రదాయాల సమ్మేళనంతో రూపుదిద్దుకున్నాయని ఈ సదస్సు ప్రధానంగా గుర్తుచేసింది. మత విశ్వాసాలు వేరైనా మానవీయ విలువలు అందరిలోనూ ఒక్కటేననే సందేశాన్ని ఈ వేదిక ప్రతిధ్వనించింది. ఒకరి విశ్వాసాలను మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం ద్వారా సమాజంలో అపోహలకు, అనవసర ఉద్రిక్తతలకు తావులేకుండా చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది.సంభాషణతోనే అపోహలకు సమాధానంమతాల మధ్య సరైన అవగాహన లేనప్పుడు అపార్థాలు, అనుమానాలు, దూరాలు పెరుగుతాయని.. వాటిని తొలగించేందుకు ఇలాంటి వేదికలు దోహదపడతాయని కార్యక్రమం చాటిచెప్పింది. పరస్పరం మాట్లాడుకోవడం, ఇతరుల అభిప్రాయాలను వినడం, భిన్న విశ్వాసాలను గౌరవించడం ద్వారా సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయవచ్చనే సందేశం వినిపించింది.
మతం ఏదైనా మానవ సేవ, పేదల పట్ల కరుణ, న్యాయం, శాంతి, సోదరభావం వంటి విలువలకు ప్రాధాన్యమివ్వాలని ఈ కార్యక్రమం గుర్తుచేసింది. మతపరమైన విభజనలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా నిలిచినప్పుడే శాంతియుత, సమైక్య సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని సర్వమత సదస్సు సందేశమిచ్చింది.వారధులు నిర్మించే ప్రయత్నం‘బియాండ్ ది డివైడ్’ ప్రదర్శన కేవలం ఒక కార్యక్రమానికే పరిమితం కాకుండా.. వివిధ మతాలు, సంస్కృతులు, సమాజాల మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఉమ్మడి వారసత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నంగా నిలుస్తోంది. విద్వేషాలకు తావులేని సమాజాన్ని నిర్మించి, సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రజలను ఆలోచింపజేయడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశం.
మతాల మధ్య ఐక్యతకు పిలుపునిస్తూ, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ అసలైన బలమని చాటిచెప్పిన ఈ సర్వమత సదస్సు సందర్శకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.
ఈ కార్యక్రమంలో చిక్కూర్ బాలాజీ దేవస్థానం అర్చకులు శ్రీ సి.ఎస్. రంగరాజన్, హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్‌కు చెందిన రెవరెండ్ ఫాదర్ మరియన్న మైఖేల్, సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్ డాక్టర్ సర్దార్ సజన్ సింగ్, మహాబోధి సొసైటీ డైరెక్టర్ భిక్కు బుద్ధపాల, భారతీయ సర్వ ధర్మ సంసద్ జాతీయ కన్వీనర్ గోస్వామి సుశీల్ జీ మహారాజ్, ఐపీఎస్ (రిటైర్డ్) అధికారి శ్రీ రోహిదాస్ వాఘమారే, మహాస్వామి శ్రీ మా. ని. ప్ర. కోర్నేశ్వర్, జమాఅతె ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీమ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
