Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అంతర్రాష్ట్ర ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్ భగ్నం…ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫాంలో నిందితులు!

Share It:

పాట్నా: బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ (STF) సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్ బట్టబయలైంది. ఈ దాడుల్లో దాదాపు 45,000 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుని, పలువురు నిందితులను అరెస్టు చేశారు. యూపీలోని బదౌన్ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌కు బీహార్, హర్యానాలోనూ కార్యకలాపాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఎస్టీఎఫ్ సంయుక్త దాడులు – అరెస్టులు
తొలుత బీహార్‌లోని ఆరా (భోజ్‌పూర్) సమీపంలో ఎస్‌టీఎఫ్ జరిపిన దాడుల్లో చందన్ తివారీతో పాటు ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 19,000కు పైగా కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తేలిన సమాచారం ఆధారంగా దర్యాప్తు బృందాలు బదౌన్, హర్యానాలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి.

మరోవైపు, హర్యానాలోని ఝజ్జర్ జిల్లా రోహడ్ టోల్ ప్లాజా సమీపంలో హర్యానా ఎస్‌టీఎఫ్ జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఒక మహిళతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. బీహార్ ఎస్‌టీఎఫ్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఒక టాటా హారియర్ కారు నుంచి 24,400, హ్యుందాయ్ ఆరా కారు నుంచి 600 కలిపి మొత్తం 25,000 తూటాలతో పాటు 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అసౌదా పోలీస్ స్టేషన్‌లో ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అరెస్టైన వారందరూ యూపీలోని బదౌన్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. బదౌన్‌లో గన్ హౌస్ నిర్వహిస్తున్న మున్నా ఖాన్.. సిర్సాలోని ‘మెహక్ గన్ హౌస్’ యజమాని విజయ్ గోయల్ నుంచి ఈ మందుగుండు సామగ్రిని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హర్యానా, బీహార్‌లలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల మధ్య సంబంధం ఉందన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫాంలో నిందితులు
ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు చందన్ తివారీ, అతని సోదరుడు అభిషేక్ తివారీలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో వారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) యూనిఫాం ధరించి ఉండటం గమనార్హం. మరో ఫోటోలో వారు ముజఫర్‌పూర్‌కు చెందిన స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కనిపిస్తున్నారు. ఇప్పటికే అభిషేక్ తివారీ ఒక ఆయుధాల స్మగ్లింగ్ కేసులో జైలులో ఉండగా, తాజాగా చందన్ తివారీని ఎస్‌టీఎఫ్ అదుపులోకి తీసుకుంది.

ప్రభుత్వ ఫ్యాక్టరీల తూటాలు స్మగ్లర్ల చేతికి ఎలా చేరాయి?
ఈ కేసులో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రి ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయుధ కర్మాగారాల్లో తయారైనవే కావడం. అధికారిక కేంద్రాల్లో ఉత్పత్తి కావాల్సిన తూటాలు అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు ఎలా మళ్లాయి, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.

గతంలో బీహార్‌లో వెలుగు చూసిన ‘జలన్ షాప్’ నకిలీ ఆయుధ లైసెన్సుల కేసుతో ఈ కొత్త నెట్‌వర్క్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. భారీ ఎత్తున తూటాలు నేర సామ్రాజ్యం చేతికి చిక్కడం వల్ల భూ మాఫియాలు, మద్యం సిండికేట్లు, ఇతర వ్యవస్థీకృత నేరగాళ్లు వాటిని ఉపయోగించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎన్‌ఐఏ, ఎస్‌టీఎఫ్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.