Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

భారతదేశ ఐక్యతా స్వప్నానికి చిరునామా… మౌలానా అబుల్ కలాం ఆజాద్!

Share It:

ముహమ్మద్ ఖుతుబుద్దీన్ అబూ షుజా, ఎం.డి., పీహెచ్‌డీ,చికాగో, అమెరికా…✍️

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్… భారతీయతను శ్వాసించిన స్వప్నజీవి… జాతి సమైక్యతకు తొలి ఇటుక… మతాల ఆధారంగా దేశాన్ని విభజించడాన్ని వ్యతిరేకించిన నిజమైన దేశభక్తుడు… సమైక్యతకు ప్రతీక, విద్యా విప్లవ ప్రదాత… ఒక జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో, పిల్లల ఆలోచనల్లో రూపుదిద్దుకుంటుందని నమ్మిన దార్శనికుడు… ఆయన కన్న కలల భారతదేశం నేటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది… నేడు ఆ మహనీయుని 138వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం…!

ఒక దేశం గొప్పతనాన్ని కేవలం ఆర్థిక సంపదతోనో, సైనిక బలంతోనో, అంతర్జాతీయ రాజకీయ ప్రాబల్యంతోనో కొలవలేం. ఆ దేశం అనుసరించే విలువలు, పాలకుల దార్శనికత, పౌరులకు కల్పించే గౌరవం, న్యాయం, విద్య, మానవత్వం పట్ల చూపే నిబద్ధతే నిజమైన గొప్పతనానికి గీటురాయి.

ఆధునిక భారత చరిత్రలో (1888–1958) ఈ విలువలన్నింటినీ తన వ్యక్తిత్వంలో అద్భుతంగా మేళవించుకున్న మహనీయుడు భరతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ . ఇస్లామీయ పండితుడు, తత్వవేత్త, రచయిత, పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, విద్యావేత్తగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మతం, కులం, భాష, ప్రాంతం వంటి సంకుచిత పరిధులను అధిగమించి విశాలమైన మానవతా దృక్పథంతో ఆలోచించిన దార్శనికుడు.

ఆయన కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశాన్ని మాత్రమే కలగనలేదు. ప్రతి పౌరుడికీ మతాలకు అతీతంగా సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ, భద్రత కలిగిన సమాజాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. ఆయన దృష్టిలో భారతదేశం అనేది కేవలం భౌగోళిక సరిహద్దులతో కూడిన భూభాగం కాదు. శతాబ్దాలుగా వివిధ మతాలు, సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు పరస్పరం కలిసిమెలిసి వికసించిన సజీవ నాగరికత.

హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు.. ఇలా అన్ని మతాల ప్రజలకూ సమానమైన స్థానం ఉన్న దేశమే ఆయన కలల భారతదేశం.

భారతదేశం ఏ ఒక్క మతానికో, వర్గానికో, సమూహానికో చెందినది కాదని, ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ సమానంగా చెందుతుందని ఆయన బలంగా విశ్వసించారు.

ఇతరుల పట్ల ద్వేషం ఆయన దేశభక్తికి పునాది కాదు. మానవత్వం పట్ల ప్రేమే ఆయన జాతీయతకు మూలం.

నేడు ఆజాద్138వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అంటే ఒక మహనీయుడి జీవితాన్ని గుర్తు చేసుకోవడమే కాదు.. ఆయన ఆశించిన భారతదేశాన్ని నిర్మించడంలో మన బాధ్యతను గుర్తించుకోవడం కూడా.

మానవత్వాన్ని ఆలింగనం చేసుకున్న ఆధ్యాత్మిక మేధావి
మౌలానా ఆజాద్ వ్యక్తిత్వంలో మేధోపరమైన ప్రతిభ, ఆధ్యాత్మిక గాంభీర్యం, రాజకీయ ధైర్యం అరుదైన రీతిలో మిళితమయ్యాయి. ఇస్లామీయ ధర్మశాస్త్రం, ఖుర్‌ఆన్ అధ్యయనం, తత్వశాస్త్రం, సాహిత్యం, చరిత్రతోపాటు ఆధునిక భావజాలంపైనా ఆయనకు అపారమైన పట్టు ఉండేది. ఆయన రచించిన తర్జుమానుల్ ఖుర్‌ఆన్, గుబారే ఖాతిర్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ వంటి గ్రంథాలు ఆయన మేధోసంపత్తికి, ఆలోచనా వైశాల్యానికి నిదర్శనాలు.

మతం మనిషిలోని మంచితనాన్ని పెంపొందించాలే తప్ప, మనుషుల మధ్య విభేదాలను సృష్టించకూడదన్నది ఆయన విశ్వాసం. ధర్మం అనేది న్యాయం, కరుణ, సహనం, మానవ గౌరవం, సామాజిక బాధ్యతలకు ప్రేరణ కావాలని ఆయన ఆకాంక్షించారు.

తన ఇస్లామీయ విశ్వాసాలు ఆయన జాతీయ దృక్పథానికి ఎప్పుడూ అడ్డంకి కాలేదు. పైగా అన్ని మతాల పట్ల గౌరవం, పరస్పర సహజీవనం, సామాజిక సామరస్యం పట్ల ఆయన నిబద్ధతను మరింత బలోపేతం చేశాయి.

ఒక వ్యక్తి నిజమైన ముస్లింగా ఉంటూనే గొప్ప భారతీయుడిగా కూడా ఉండవచ్చని ఆయన తన జీవితంతో నిరూపించారు. మత విశ్వాసాలను గౌరవిస్తూనే దేశ సమైక్యతకు కట్టుబడి ఉండటం సాధ్యమేనని చాటిచెప్పారు.

ఆయన దృష్టిలో హిందూ–ముస్లిం ఐక్యత అనేది కేవలం రాజకీయ అవసరం కాదు. అది భారతీయ నాగరికతకు సంబంధించిన వాస్తవం, నైతిక బాధ్యత, జాతీయ ఉనికికి అత్యంత కీలకమైన పునాది.

ఆదర్శాల కోసం రాజీపడని స్వాతంత్య్ర సమరయోధుడు
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మౌలానా ఆజాద్ పాత్ర అసాధారణమైనది. ఆయన కలం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించింది. ఆయన ప్రసంగాలు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించాయి.

అల్ హిలాల్, అల్ బలాగ్ పత్రికల ద్వారా బ్రిటిష్ వలస పాలనను తీవ్రంగా విమర్శిస్తూ స్వాతంత్య్రం, ఆత్మగౌరవం, జాతీయ ఐక్యత ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఆయన రచనల్లోని విప్లవాత్మక భావజాలం బ్రిటిష్ పాలకులను కలవరపరిచింది. ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను పెంపొందించినందుకు ఆయన అనేక ఇబ్బందులు, నిర్బంధాలను ఎదుర్కొన్నారు.

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1923లో ఎన్నికైన ఆయన, అత్యంత చిన్న వయసులో ఆ పదవిని చేపట్టిన నాయకుడిగా చరిత్రలో నిలిచారు. అనంతరం 1940 నుంచి 1946 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

దేశ విభజన ఆలోచనలు బలపడుతున్న సమయంలో కూడా ఆయన తన ఐక్యతా సిద్ధాంతాన్ని వదులుకోలేదు. మత ప్రాతిపదికన దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. శతాబ్దాలుగా కలిసి జీవించిన ప్రజల మధ్య భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక సంబంధాలు ఏర్పరిచిన బంధాలను మతం పేరుతో విడదీయడం సాధ్యం కాదని ఆయన భావించారు.

చివరకు దేశ విభజన జరిగినప్పటికీ, భారతదేశ సమ్మిళిత సంస్కృతిపై ఆయనకున్న విశ్వాసం చెక్కుచెదరలేదు. మతం మనిషిలో నైతికతను పెంపొందించాలి కానీ ద్వేషాన్ని కాదు. దేశభక్తి ప్రజలను ఏకం చేయాలి కానీ పొరుగువారిని శత్రువులుగా మార్చకూడదు. ఇదే ఆయన సందేశం.

ముస్లింల నాయకుడు.. భారతీయులందరి రాజనీతిజ్ఞుడు
భారతీయ ముస్లింల చరిత్రలో మౌలానా ఆజాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్య్రానికి ముందు, అనంతరం నెలకొన్న రాజకీయ అనిశ్చితి సమయంలో ముస్లింలకు ఆయన ఆత్మవిశ్వాసంతో కూడిన మార్గాన్ని చూపించారు.

మతపరమైన గుర్తింపును కాపాడుకుంటూనే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావచ్చని విశ్వసించారు. ముస్లింలు తమ మతం, సంస్కృతి, భాష, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే దేశ రాజకీయ, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక అభివృద్ధిలో సమాన భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

అయితే ఆయన ఆలోచనలు ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. సమాజంలోని ఒక వర్గం అభ్యున్నతిని మొత్తం దేశ సంక్షేమం నుంచి వేరుచేసి చూడలేమని ఆయన నమ్మారు. ప్రతి భారతీయుడి గౌరవం, భద్రత, స్వేచ్ఛ సమానంగా పరిరక్షించబడినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆయన భావన.

మైనారిటీల హక్కుల పరిరక్షణ అనేది ఏదో ఒక వర్గానికి ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక రాయితీ కాదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపక్వతకు, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధతకు నిదర్శనం. ఒక వర్గంపై జరిగే అన్యాయం మొత్తం సమాజ నైతిక పునాదులను బలహీనపరుస్తుంది. ప్రతి పౌరుడికీ న్యాయం అందినప్పుడే దేశం నిజమైన అర్థంలో బలపడుతుంది.

ఆధునిక భారత విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన దార్శనికుడు
స్వాతంత్య్రానంతర భారతదేశ నిర్మాణంలో మౌలానా ఆజాద్ అందించిన అత్యంత విలువైన సేవల్లో విద్యారంగానికి సంబంధించిన కృషి ప్రధానమైనది. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958లో మరణించే వరకు ఆయన సేవలందించారు. రాజకీయ స్వాతంత్య్రం వచ్చినంత మాత్రాన దేశానికి సంపూర్ణ విముక్తి లభించదని, ప్రతి పౌరుడికీ విద్యా స్వేచ్ఛ, మేధో వికాసం అందినప్పుడే అది సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు.

ఒక కొత్త దేశ భవిష్యత్తు కేవలం రాజకీయ వ్యవస్థలపై ఆధారపడదని, అక్కడి ప్రజలకు అందే విద్యా ప్రమాణాలు, పరిశోధన, విజ్ఞానాభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని ముందుగానే గుర్తించారు.
ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులోకి రావాలని, శాస్త్రీయ పరిశోధనలు విస్తరించాలని, సాంకేతిక విద్య అభివృద్ధి చెందాలని, మహిళా విద్యకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన కృషి చేశారు.

ఆయన హయాంలో ఐఐటీలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అవసరమైన విద్యా సంస్థాగత వ్యవస్థ బలోపేతమైంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), సాహిత్య, సంగీత, కళా రంగాలకు సంబంధించిన జాతీయ అకాడమీల వంటి సంస్థల అభివృద్ధికి ఆయన నాయకత్వం తోడ్పడింది.

ఆయన దృష్టిలో విద్య అంటే కేవలం ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడే సాధనం కాదు. స్వతంత్రంగా ఆలోచించడం, మంచిచెడులను విశ్లేషించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగడం కోసం విద్య అవసరం.

మతం, కులం, లింగం, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య అందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన విద్యారంగ సేవలకు గుర్తింపుగా నవంబర్ 11ను భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేశానికి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా 1992లో ఆయనకు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భరతరత్న ప్రదానం చేశారు.

నేటి భారతదేశానికి ఆజాద్ అవసరం ఎంతో ఉంది
మౌలానా ఆజాద్ మరణించి దాదాపు ఏడు దశాబ్దాలు గడిచినా ఆయన ఆశయాలు నేటికీ ప్రాముఖ్యతను కోల్పోలేదు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో వాటి అవసరం మరింత పెరిగింది. భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. యువ జనాభా, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, విస్తృతమైన మేధో సంపత్తి దేశానికి బలమైన పునాదులు. అయితే దేశాభివృద్ధిని కేవలం ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి, అంతర్జాతీయ గుర్తింపుతో మాత్రమే అంచనా వేయలేం.

పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? మహిళలకు గౌరవం, భద్రత ఉన్నాయా? మైనారిటీల హక్కులు పరిరక్షించబడుతున్నాయా? రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ప్రతి పౌరుడికీ అందుతున్నాయా? భిన్నమైన విశ్వాసాలు, అభిప్రాయాలు కలిగిన ప్రజలు పరస్పర గౌరవంతో జీవించగలుగుతున్నారా? అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆజాద్ ఆలోచనలు మనకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. శాస్త్రీయ పురోగతికి ఆధ్యాత్మిక జ్ఞానం అడ్డంకి కాదని, మత విశ్వాసాలు ఇతర మతాల పట్ల గౌరవాన్ని తగ్గించకూడదని, సమాజం పట్ల ప్రేమ దేశం పట్ల బాధ్యతతో ముడిపడి ఉండాలని ఆయన జీవితం చెబుతుంది. సందేహాన్ని అవగాహనతో, పక్షపాతాన్ని జ్ఞానంతో, విద్వేషాన్ని సంభాషణతో ఎదుర్కోవాలని ఆయన జాతీయ సమైక్యతా సిద్ధాంతం మనకు బోధిస్తుంది. భారతదేశ బలం భిన్నత్వంలోనే ఉందని, దానిని న్యాయం, పరస్పర గౌరవంతో కాపాడుకున్నప్పుడే అది జాతి సంపదగా మారుతుందని ఆయన జీవితం నిరూపిస్తుంది.

యువతకు ఆజాద్ ఇచ్చిన సందేశం
మౌలానా ఆజాద్ జీవితం నేటి యువతకు ధైర్యం, విజ్ఞానం, నైతిక విలువలతో కూడిన అద్భుతమైన పాఠం. మేధోపరమైన ప్రతిభకు నైతిక బాధ్యత తోడైనప్పుడే దానికి నిజమైన సార్థకత ఉంటుందని ఆయన నిరూపించారు. తరతరాలుగా కొనసాగుతున్నాయనే కారణంతో పాత పక్షపాతాలను యువత అంగీకరించకూడదు. ఆవేశాన్ని ధైర్యంగా, నినాదాలను జ్ఞానంగా, ద్వేషాన్ని దేశభక్తిగా భావించకూడదు.

శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, మానవీయ విలువలు, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం పెంపొందించుకోవాలి. తమ మత, సాంస్కృతిక సంప్రదాయాలను అర్థం చేసుకుంటూనే ఇతరుల విశ్వాసాలు, జీవన విధానాలను గౌరవించాలి. వైద్యులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, పాత్రికేయులు, తత్వవేత్తలు, ప్రజాసేవకులు.. ఎవరైనా తమ వ్యక్తిగత విజయంతోపాటు సమాజ సంక్షేమానికి కృషి చేయాలి.

ఆజాద్ కలలుగన్న భారతదేశంలో అందరూ ఒకే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకే మతాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. ఒకే జీవనశైలిని పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరికీ సమానంగా ఈ దేశంలో జీవించే హక్కు, గౌరవం ఉండాలి. ఇదే యువతకు ఆయన అందించిన అత్యంత విలువైన సందేశం.

ఆజాద్ కలలు సాకారం కావాలి
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి సందర్భంగా ఆయనకు నిజమైన నివాళి అర్పించాలంటే పూలమాలలు వేయడం, సభలు నిర్వహించడం, ప్రసంగాలు చేయడం మాత్రమే సరిపోదు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి.

ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య అందుతోందా? విద్యాసంస్థల్లో స్వేచ్ఛాయుత ఆలోచనలకు, శాస్త్రీయ పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తోందా? ప్రతి పౌరుడి గౌరవం, రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడుతున్నాయా? వివిధ మతాల ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించేందుకు మనం ఏమి చేస్తున్నాం? అనే ప్రశ్నలను మనం వేసుకోవాలి.

ఆజాద్ కలలుగన్న విద్యావంతమైన, ఐక్యమైన, మానవీయమైన, అభివృద్ధి చెందిన భారతదేశం చరిత్ర పుస్తకాల్లోని ఒక అధ్యాయంగా మిగిలిపోకూడదు. అది మన జాతీయ లక్ష్యంగా మారాలి.
ఆజాద్‌ను కేవలం ఇస్లామీయ పండితుడిగానో, స్వాతంత్య్ర సమరయోధుడిగానో, రాజకీయ నాయకుడిగానో, తొలి విద్యాశాఖ మంత్రిగానో మాత్రమే గుర్తుంచుకోకూడదు. భారతీయ సమ్మిళిత సంస్కృతికి గొప్ప రూపశిల్పిగా, మానవ గౌరవానికి రక్షకుడిగా, దేశ భవిష్యత్తు ప్రజలందరినీ కలుపుకొని సాగాలని ఆకాంక్షించిన మహోన్నత దార్శనికుడిగా ఆయనను స్మరించుకోవాలి.

నిజమైన దేశభక్తి అంటే మరో సమాజంపై ద్వేషం పెంచుకోవడం కాదు. దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడం, వారి కోసం త్యాగం చేయడం, సేవ చేయడం. అదేవిధంగా నిజమైన మత విశ్వాసం అంటే ఇతరులను తక్కువగా చూడటం కాదు. న్యాయం, వినయం, కరుణ, శాంతి, మానవత్వాన్ని ఆచరించడం.

మౌలానా ఆజాద్ గొప్ప వారసత్వం ఆయన స్వాతంత్య్రం కోసం పోరాడిన భారతదేశం మాత్రమే కాదు.. భావితరాలు నిర్మించాలని ఆయన కలలుగన్న భారతదేశం కూడా!

అజ్ఞానంపై విజ్ఞానం విజయం సాధించే భారతదేశం కావాలి. వివక్షపై న్యాయం గెలవాలి. ద్వేషం స్థానంలో సంభాషణ, విభేదాల స్థానంలో సోదరభావం, సంకుచితత్వం స్థానంలో విశాల మానవత్వం వెల్లివిరియాలి. ఆయన 138వ జయంతి సందర్భంగా ఆ మహోన్నత ఆశయాల సాధనకు మనమంతా పునరంకితం కావాలి.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు వర్ధిల్లాలి!
భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లాలి!

జైహింద్!

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.