హైదరాబాద్: శిశువుల అక్రమ అమ్మకాల ముఠాలపై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీలలో భాగంగా, తెలంగాణలోని ఏడు సంతాన సాఫల్య కేంద్రాలకు షో-కాజ్ నోటీసులు జారీ చేశారు. సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART) కేంద్రాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలంగాణ వ్యాప్తంగా 44 ART కేంద్రాలను గుర్తించి, ఇప్పటివరకు 27 కేంద్రాలను తనిఖీ చేసింది. ఈ ఏడు ఆసుపత్రులలో 13 తీవ్ర ఉల్లంఘనలు కనుగొనబడగా, 31 మంది మహిళలు అండదాతలుగా ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్రమ శిశువుల అమ్మకాల ముఠాలు, అండదానం, IVF కుంభకోణాలపై వెలుగులోకి వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో, మహిళలను ఎలా సంప్రదించారు అనే విషయంతో సహా వైద్యులు, IVF కేంద్రాలు మరియు మధ్యవర్తుల పాత్రపై విచారణకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ ఆదేశించారు.
సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అండ్ రీసెర్చ్ సెంటర్ కేసు ప్రముఖమైన వాటిలో ఒకటి. ఆ క్లినిక్… దొంగిలించిన నవజాత శిశువులను నకిలీ DNA, జనన రికార్డులతో అప్పగించిందని ఆరోపణలు ఉన్నాయి. యజమాని డాక్టర్ ఎ. నమ్రత, ఆమె కుమారుడిని అరెస్టు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.
ఆగస్టులో, రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను ప్రదర్శించకపోవడం, ఫిర్యాదుల విభాగం లేకుండా పనిచేయడం, మరియు నమోదిత చిరునామా కాకుండా ఇతర ప్రదేశాలలో కేంద్రాలను నడపడం వంటి కారణాలతో 50 ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేయబడ్డాయి.
రెండు కేంద్రాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. తొమ్మిది కేంద్రాల అనుమతులు తాత్కాలికంగా ఉపసంహరించారు. ఇదిలా ఉండగా, తాజాగా మొన్నటికి మొన్న మహిళల నుండి అక్రమంగా అండాలను సేకరిస్తున్నారనే ఆరోపణలపై హైదరాబాద్లోని ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు.
ART క్లినిక్లు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021 కింద నమోదు చేసుకోవాలి. నవంబర్ 6న, తెలంగాణలో నమోదైన ART క్లినిక్లు మరియు ART బ్యాంకుల వివరాలను కోరేందుకు వైద్య అధికారుల బృందం న్యూఢిల్లీలోని నేషనల్ ART అండ్ సరోగసీ రిజిస్ట్రీని సందర్శించింది. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
