హైదరాబాద్: కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వరుస వివాదాలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రాంగణాల్లో సినిమా ప్రచారాలు, ప్రదర్శనలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించే అవకాశం ఉంది. విద్యా సంస్థలను వాణిజ్య కార్యకలాపాలకు వేదికలుగా ఉపయోగించకుండా నిరోధించడం, పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడినప్పుడు వారి భద్రతను నిర్ధారించడం ఈ ప్రతిపాదిత చర్య ముఖ్య ఉద్దేశం.
నివేదికల ప్రకారం, విద్యా ప్రాంగణాల్లో అనుమతించే కార్యకలాపాలకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను పరిశీలించి, పరిమితం చేయాల్సిన కార్యక్రమాలను గుర్తించాలని ఉన్నతాధికారులు విద్యాశాఖను కోరారు. ప్రతిపాదిత చట్రం ప్రకారం, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో విద్యాసంబంధ, క్రీడా, చిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి విద్యాసంస్థలకు అనుమతి ఇవ్వవచ్చు. అయితే, సినిమా ప్రచారాలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను నిషేధించే అవకాశం ఉంది.
భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించే కళాశాలలు, ముందుగా స్థానిక విద్యా అధికారులకు లేదా పోలీసులకు తెలియజేయడంతో పాటు, హాజరయ్యే వారి సంఖ్య, వేదిక ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, జన సమూహ నిర్వహణ, అగ్నిమాపక భద్రతా చర్యల వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
కాగా, హైదరాబాద్‌లోని విద్యాసంస్థలకు సంబంధించి జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. అక్టోబర్ 17న, నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన దండియా నైట్ కార్యక్రమంలో సుమారు 80 అడుగుల తాత్కాలిక లైటింగ్ నిర్మాణం కూలిపోవడంతో, మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, కనీసం 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన, క్యాంపస్‌లో జరిగే పెద్ద సమావేశాల వద్ద భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
అంతకుముందు, ఆగస్టు 22న, మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో నటుడు యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జనం ఒక్కసారిగా దూసుకువచ్చారు. నటుడిని ఒక్కసారి చూడటానికి విద్యార్థులు, అభిమానులు ముందుకు దూసుకెళ్లడంతో ఒక ఫ్లడ్‌లైట్ స్తంభం, స్పీకర్ బాక్సులు కూలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
కాగా, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు… విద్యార్థులను, క్యాంపస్ సౌకర్యాలను రాజకీయ, వ్యక్తిగత, వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయనే ఆరోపణలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
అంతేకాదు విద్యా క్యాంపస్‌లు వాణిజ్య ప్రచారాల కంటే ప్రధానంగా విద్యాభ్యాసం, క్రీడలు, విద్యార్థుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించే చిన్న సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలపై పూర్తిస్థాయి నిషేధం విధించే అవకాశం లేదు.
ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిత ఆంక్షలు, భద్రతా అవసరాలను పరిశీలిస్తోందని నివేదికలు తెలిపాయి. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. తొందరలోనే సమగ్ర మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
