హైదరాబాద్: టీ-హబ్ (T-Hub)లో నేడు జరగనున్న ఇజ్రాయెల్ రక్షణ సంస్థల ఎంఓయూ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన తెలంగాణ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) నాయకులను సిటీ పోలీసులు నిన్న అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ ఇద్దరు సభ్యులను ఏడు గంటల తర్వాత విడుదల చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా గళం విప్పిన SIO సభ్యులను నిర్బంధించడం చర్చనీయాంశమైంది.
SIO తెలిపిన వివరాల ప్రకారం… “పాలస్తీనా సమస్యను బలంగా వినిపిస్తూ, టీ-హబ్‌లో ఇజ్రాయెల్ కంపెనీల కార్యక్రమాన్ని వ్యతిరేకించినందుకు SIO తెలంగాణ నాయకులు అర్ధరాత్రి అరెస్టును ఎదుర్కొన్నారు. మనస్సాక్షి గొంతులను అణచివేయలేరు. పాలస్తీనా పట్ల మా సంఘీభావం ఎప్పటికీ చెక్కుచెదరదు” అని పేర్కొంది.
ఈమేరకు SIO తెలంగాణ విద్యా కార్యదర్శి అబ్దుల్ తాజ్ మాట్లాడుతూ… “నవంబర్ 14న జరిగిన పత్రికా సమావేశం ఆధారంగా మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 11:45 గంటలకు ఛత్తా బజార్‌లోని తెలంగాణ SIO కార్యాలయం నుంచి పోలీసులు నన్ను, నా సహోద్యోగిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అయితే చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫేకర్ అలీ పూచీకత్తు ఇవ్వడంతో ఈ ఉదయం వారిని విడుదల చేశారు. మరోవైపు, ఇది ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే చేపట్టిన అరెస్ట్ అని మీర్‌చౌక్ పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ SIO ప్రెస్‌మీట్
సోమవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌ను 20 ఇజ్రాయెల్ టెక్నాలజీ సంస్థల ప్రతినిధి బృందం సందర్శించనున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO), పౌర సమాజ సమూహాలు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది.
కాగా శనివారం నాడు బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్లో ఎస్ఐఓ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ… టీ-హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్న అనేక కంపెనీలకు పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమంతో సంబంధం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీల సైనిక ఒప్పందాలు, కంపెనీ రికార్డులు, అందుబాటులో ఉన్న ఇతర సాక్ష్యాలను ఉటంకించారు. ఈ కంపెనీలు.. దాడి చేసే డ్రోన్లు, మిలిటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ట్యాంక్ సెన్సార్లు, రోబోటిక్స్, నిఘా సాంకేతికతలను సరఫరా చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టరేట్’ (DDR&D) భాగస్వామ్యం ఉండటం గమనార్హం.
