హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతులపై స్టే ఇచ్చేందుకు ఎన్జీటీ నిరాకరించింది. ఈ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు, ఆగస్టు 5న జారీ చేసిన అనుమతులను నిలిపివేయడానికి ధర్మాసనం అంగీకరించలేదు. జస్టిస్ పుష్ప సత్యనారాయణ ( డాక్టర్ సుజిత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది.
హైదరాబాద్‌కు చెందిన బాబూరావు అనే వ్యక్తి ఈ పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ, ఇతర సంబంధిత సంస్థలు ఇచ్చిన ఈ అనుమతులను ఆయన ప్రశ్నించారు. ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చే వరకు భూసేకరణ, నిర్మాణాలు, భూమిని చదును చేయడం, తవ్వకాలు, సైట్ సిద్ధం చేయడం వంటి పనులను నిలిపివేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం తరపున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ, ఇది నదిని పునరుద్ధరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి,హైదరాబాద్‌లో వరద ముప్పును నివారించడానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అన్ని చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపడుతున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ వివరించారు.
