Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హైదరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు!

Share It:

హైదరాబాద్: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న పలు ఆహార, మాంసం విక్రయ కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రతా విభాగం కొరడా ఝుళిపించింది. నగరవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 11 బృందాలు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఎలుకల బెడద, మురికి డ్రైనేజీలు, గడువు తీరిన నిల్వలు, తప్పుడు తయారీ తేదీల వంటి ఘోర ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడుల్లో రూ. 6.59 లక్షలకు పైగా విలువైన 1,672 కిలోల ఆహారాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ఐదు దుకాణాల మూసివేత, ఆరు సంస్థల లైసెన్సుల సస్పెన్షన్‌కు అధికారులు ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర ఆహార, నిత్యావసర ఔషధాల ప్రమాణాల అథారిటీ (టీజీ సేఫ్) పలు మాంసం దుకాణాలు, మెట్రో స్టోర్లను తనిఖీ చేయగా, అనేక ఉల్లంఘనలను గుర్తించింది.

ఓ హోటల్‌ కిచెన్‌ ఏరియా అంతా మాంసం అవశేషాలతో నిండి ఉంది. మురుగు కాలువలు శుభ్రం చేయకుండా మూసుకుపోయి ఉన్నాయి. ఈగలు, బొద్దింకలు, ఎలుకల బెడద అధికంగా ఉంది, అలాగే ఎలుకల మలం కూడా ఉంది. ఆహార పదార్థాలపై సరైన లేబుల్స్ లేవు.

అధికశాతం దుకాణాలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు, ఉద్యోగుల ఆరోగ్య రికార్డులు, నీటి విశ్లేషణ నివేదికల వంటి అవసరమైన పత్రాలు, రికార్డులు లేకుండానే నడుస్తున్నాయి. ఈ దాడుల్లో సుమారు రూ. 6,59,213/- విలువైన 1,672 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని పారవేశారు.

ఐదు మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. అవి – నల్లకుంటలోని ఆనంద్ మటన్ అండ్ చికెన్ పాయింట్, గౌతమ్ నగర్ రోడ్డులోని ఏపీ ఫిషరీస్ ఫిష్ స్టాల్, సికింద్రాబాద్‌లోని ఎస్పీ రోడ్డులో ఉన్న ప్రోటీన్ ఫుడ్స్, ఎరగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లోని సల్మాన్ కేజీఎన్ పౌల్ట్రీ, న్యూ డీసెంట్ మీట్ చికెన్ అండ్ ఫిష్ షాప్.
మరోరెండు సంస్థలకు మెరుగుదల నోటీసులు, మరో 10 సంస్థలకు షో-కాజ్ నోటీసులు అధికారులు జారీ చేశారు. ముషీరాబాద్‌లోని వతన్ ఫ్రెష్ మార్ట్‌కు, ఉప్పల్‌లోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా లిమిటెడ్‌కు మెరుగుదల నోటీసులు జారీ చేశారు.

గగన్‌పహాడ్, మూసాపేట్, సుచిత్ర ఎక్స్ రోడ్‌లోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ అవుట్‌లెట్లకు, గోషామహల్‌లోని ఎంజే మార్కెట్‌లో ఉన్న కరాచీ బేకరీకి, మేడ్చల్ మండలం కిస్తాపూర్ గ్రామంలోని లిషియస్‌కు షో-కాజ్ నోటీసులు జారీ చేసారు.

ఆరు రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెన్షన్
తెలంగాణ ఆహార భద్రతా విభాగం ఆరు ఆహార సంస్థల FSSAI లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తక్షణమే సస్పెండ్ చేసింది. వాటిలో ముషీరాబాద్‌లోని జమిస్తాన్‌పూర్‌లో ఉన్న వతన్ ట్రేడర్స్; సికింద్రాబాద్‌లోని పంజాబ్ ఫిష్ కంపెనీ; సికింద్రాబాద్, ఎస్డీ రోడ్‌లో ఉన్న హై ప్రోటీన్; శ్రీనగర్ కాలనీలోని కరాచీ INC; గగన్‌పహాడ్‌లోని పెదమ్మగడ్డలో ఉన్న కరాచీ బేకరీ పెర్ల్ ప్రైవేట్ లిమిటెడ్; ఉప్పల్‌లోని లక్ష్మీ నారాయణ్ నగర్ కాలనీలో ఉన్న ఎస్ఎం సీఏ కార్పొరేషన్ ఉన్నాయి.

అలాగే వతన్ ట్రేడర్స్‌లో అపరిశుభ్రమైన కబేళా వ్యర్థాలు, మురికి నేలలు, గోడలు, విరిగిన ఫ్లోరింగ్, ఈగలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.

పంజాబ్ ఫిష్ కంపెనీలో, అపరిశుభ్రమైన చేపల ప్రాసెసింగ్, నిల్వ ప్రాంతాలు, నిలిచిపోయిన నీరు, మూసుకుపోయిన డ్రైనేజీలు, బయటపడిన చేపలు, రొయ్యలు, గడువు ముగిసిన ఫ్రోజెన్ రొయ్యలు, తుప్పు పట్టిన కత్తులు, చాకులను గుర్తించారు.

హై ప్రోటీన్‌లో గడువు ముగిసిన, లేబుల్ లేని ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు కనుగొన్నారు. చికెన్ ప్రాసెసింగ్ ప్రాంతంలో సజీవంగా ఉన్న ఎలుకలను, ఒక ఫ్రీజర్‌లో చనిపోయిన ఈగలను అధికారులు గుర్తించారు.

శ్రీనగర్ కాలనీలోని కరాచీ ఐఎన్‌సిలో, అపరిశుభ్రమైన రిఫ్రిజిరేటర్లు, ఆహార పదార్థాలతో పాటు శుభ్రపరిచే రసాయనాలను నిల్వ ఉంచడం, శాకాహార, మాంసాహార ఆహారాన్ని ఒకే రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచినట్లు కనుగొన్నారు. పచ్చి, వండిన ఆహారాన్ని వేరువేరుగా నిల్వ చేయలేదు. మూసుకుపోయిన మురుగు కాలువలు, మూతలేని చెత్తబుట్టలు, ఈగలు, బొద్దింకల బెడద కూడా ఉంది.

గగన్‌పహాడ్‌లోని కరాచీ బేకరీ పెర్ల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో, అధికారులు రూ. 4,34,813 విలువైన 1,012 కిలోల ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనేక ఉత్పత్తులు అక్టోబర్‌లో తయారు చేసినప్పటికీ, వాటిపై నవంబర్ తయారీ తేదీలతో లేబుల్ చేసినట్లు కనుగొన్నారు.

ఉప్పల్‌లోని ఎస్ఎం సీఏ కార్పొరేషన్‌లో, ఈగల బెడద, మురికిగా ఉన్న డోర్ కర్టెన్లు, దెబ్బతిన్న ఫ్లోరింగ్, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం వంటివి గుర్తించారు. ఐస్ తయారుచేసే యంత్రం దగ్గర అంతా అపరిశుభ్రంగా ఉంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.