వాషింగ్టన్: ఖలిస్తానీ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాకు న్యూయార్క్‌లోని యూఎస్ ఫెడరల్ కోర్టు 235 నెలల జైలు శిక్ష విధించింది. కాగా, జైలు శిక్ష పూర్తయిన తర్వాత నిఖిల్ గుప్తాపై బహిష్కరణ (డిపోర్టేషన్) ప్రక్రియ చేపడతారని న్యాయమూర్తి తెలిపారు.
మరోవైపు, గుప్తా తరపు న్యాయవాదులు, ఒక మాజీ భారత ప్రభుత్వ ఉద్యోగి ఒత్తిడితో అతను ఈ కుట్రలోకి లాగబడ్డాడని వాదిస్తూ, గణనీయంగా తక్కువైన 144 నెలలు, అంటే 12 సంవత్సరాల శిక్షను కోరారు.
కోర్టులో, గుప్తా తరపు న్యాయవాది ఇసాబెల్ ఎ. కిర్ష్నర్, గుజరాత్ పోలీసుల ముందున్న తన కేసు కారణంగా ఆయన ఒత్తిడికి లోనయ్యారని పునరుద్ఘాటించారు. తీర్పు వెలువడటానికి ముందు, పన్నూన్‌కు ఒక ప్రకటన చేసేందుకు అనుమతి లభించింది. అందులో అతను భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కుట్ర వల్ల తన వృత్తి, వ్యక్తిగత జీవితంపై పడిన పరిణామాల గురించి మాట్లాడారు.
తనను తాను “కేవలం ఒక సాధారణ కుటుంబ వ్యక్తిని” అని అభివర్ణించుకున్నారు. ఈ కుట్రలో చేరినందుకు బాధ్యతను అంగీకరిస్తున్నానని చెప్పారు. అతను పన్నూన్‌కు, సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పి, శిక్షను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. “పన్నూన్‌కు క్షమాపణలు, నేను బాధపెట్టిన వర్గాలకు క్షమాపణలు, నా సొంత కుటుంబానికి క్షమాపణలు” అని గుప్తా అన్నారు.
కాగా, ప్రస్తుతం 55 ఏళ్ల వయసున్న, ఢిల్లీకి చెందిన గుప్తా, కిరాయి హత్యకు కుట్ర, కిరాయి హత్య, మనీలాండరింగ్‌కు కుట్ర అనే మూడు అభియోగాలను ఈఏడాది ఫిబ్రవరి 13న అంగీకరించారు. ఈ అభియోగాలకు కలిపి గరిష్టంగా 40 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.
చారణ అనంతరం, న్యూయార్క్ దక్షిణ జిల్లా యూఎస్ అటార్నీ జేమీ మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటనలో, గుప్తాకు విధించిన శిక్ష “ఒక స్పష్టమైన హెచ్చరికగా పనిచేయాలి” అని అన్నారు. “అమెరికా గడ్డపై లేదా అమెరికా పౌరులపై హింసకు పాల్పడటానికి ప్రయత్నించే ఎవరినైనా అమెరికా అధికారులు వెంబడించి, బాధ్యులను చేస్తారు” అని ఆయన తెలిపారు.
గుప్తా తాను యూఎస్ న్యాయవ్యవస్థ పరిధికి అతీతుడినని భావించారని, కానీ ఆయన పొరబడ్డారని మెక్‌డొనాల్డ్ అన్నారు. “నేటి శిక్ష, గుప్తాను అతని క్రూరమైన మరియు పథకం ప్రకారం పన్నిన కుట్రకు బాధ్యుడిని చేస్తుంది. ఈ రకమైన ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తులపై, వారు ఎక్కడ ఉన్నా సరే, విచారణ జరిపేందుకు మాకున్న సామర్థ్యం, సంసిద్ధత, నిబద్ధత ఏ స్థాయిలో ఉన్నాయో ఇది చూపిస్తుందని అమెరికా అటార్నీ అన్నారు.”
కాగా, గుప్తా అరెస్టుకు సంబంధించిన పరిస్థితులు మొదట్లో అత్యంత గోప్యంగా ఉంచారు. యూఎస్ అభ్యర్థన మేరకు, 2023 జూన్ 30న చెక్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లో ఒక సిక్కు కార్యకర్తను చంపడానికి కిరాయి హంతకుడిని నియమించుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగపత్రాన్ని బహిర్గతం చేసినప్పుడు, అదే సంవత్సరం నవంబర్‌లో ఈ అరెస్టు విషయం బహిరంగపరిచారు.
అసలు అభియోగపత్రంలో పేరు పేర్కొన్నప్పటికీ, లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి అమెరికా, కెనడా పౌరుడు, భారతదేశంలో నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే సంస్థకు జనరల్ కౌన్సిల్ అయిన పన్నూన్ అని అందరికీ తెలిసిందే.

