టెహ్రాన్: అమెరికా తన బాధ్యతలను నెరవేర్చి, ఇరాన్ విధించిన షరతులను అంగీకరిస్తే, హర్ముజ్ ప్రాంతంలో భద్రతను “వీలైనంత తక్కువ సమయంలో” పునరుద్ధరించవచ్చని ఇరాన్ తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈమేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ… అమెరికా తన బాధ్యతలను నెరవేర్చితే రెండు గంటల్లోనే జలసంధిని తిరిగి తెరవగలమని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఐఆర్ఎన్ఏ’ (IRNA) వెల్లడించింది.
ఇరాన్ తన బాధ్యతలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, అవతలి పక్షం కూడా సంబంధిత షరతులను పాటిస్తే, ఇరాన్ తన బాధ్యతలను “వీలైనంత తక్కువ సమయంలో” అమలు చేయగలదని బఘాయి స్పష్టం చేశారు.
“ఈ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏమిటంటే, మేము మా బాధ్యతలను నెరవేర్చడంలో, మా హక్కులను కాపాడుకోవడంలో మరియు మేము విధించిన షరతులను నిలబెట్టుకోవడంలో చాలా సీరియస్‌గా ఉన్నాము. అమెరికా తన బాధ్యతలను నెరవేరిస్తే, హోర్మజ్ ప్రాంతంలో భద్రతను అతి తక్కువ సమయంలో పునరుద్ధరించవచ్చు. దీని అర్థం ఈ సమస్యకు సంబంధించిన సంక్లిష్టతలను విస్మరించడం కాదు; ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్కు ఏమి కావాలో స్పష్టంగా తెలుసు, ఇరాన్ ప్రజల హక్కులు ఏమిటో, వాటి పరిధి ఎంతవరకు ఉందో మాకు అవగాహన ఉంది. ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోము” అని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ తన హక్కుల పరిధిలోనే డిమాండ్లు చేస్తోందని, అసాధారణమైన షరతులేవీ విధించడం లేదని ఆయన నొక్కి చెప్పారు. “ఇవన్నీ కొత్త షరతులు కావు, అలాగే ఇరాన్ హక్కుల పరిధికి వెలుపల ఉన్న డిమాండ్లు కూడా కావు. ఇవి ఇరాన్ ప్రజల హక్కులలో అంతర్భాగం మాత్రమే” అని ఆయన తెలిపారు.
అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుండి వైదొలగడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అటువంటి సమాచారం ఏదీ విదేశాంగ శాఖకు అందలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ 1970 నుండి NPTలో సభ్యదేశంగా ఉంది.
ఇరాన్‌లోని ఆనకట్టలను సైనిక స్థావరాలుగా చిత్రీకరిస్తున్న అమెరికా మీడియా నివేదికలు, ఈ స్థావరాలపై దాడి జరిగితే ఇరాన్ ప్రతిస్పందన గురించి అడిగిన ప్రశ్నలకు బఘాయీ సమాధానమిస్తూ, “వారు అలాంటి పని చేయడానికి సాహసించరు” అని అన్నారు.
