ముహమ్మద్ ముజాహిద్ 🖊️
భారత రాజ్యాంగ నిర్మాణం ప్రస్తావనకు రాగానే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేరు ప్రముఖంగా గుర్తుకొస్తుంది. అయితే రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన ఇతర మేధావుల సేవలు కూడా సముచిత గుర్తింపునకు నోచుకోవాలి. అలాంటి వారిలో సర్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా ఒకరు. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యుడిగా పనిచేసిన ఏకైక ముస్లిం నాయకుడు ఆయన.
అస్సాంలోని గౌహతిలో 1885లో జన్మించిన సాదుల్లా న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, సమర్థ పరిపాలకుడిగా విశేష గుర్తింపు పొందారు. గౌహతి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా, అస్సాం మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేశారు. గిరిజన ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు.
రాజకీయంగా ముస్లిం లీగ్‌తో అనుబంధం కలిగిన ఆయన, దేశ విభజనకు ముందు పాకిస్థాన్ డిమాండ్‌కు మద్దతు పలికారు. అయినప్పటికీ విభజన అనంతరం అస్సాంలోనే కొనసాగారు. ఆయన రాజకీయ ప్రస్థానం అనేక సంక్లిష్టతలతో కూడుకున్నదన్నది వాస్తవం.
అయితే రాజకీయ భిన్నాభిప్రాయాల ప్రాతిపదికన రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్రను విస్మరించడం సమంజసం కాదు. రాజ్యాంగం ఒక వ్యక్తి కృషి ఫలితం మాత్రమే కాదు. భిన్న ప్రాంతాలు, నేపథ్యాలు, ఆలోచనలున్న అనేకమంది మేధావుల సమష్టి కృషికి ప్రతిరూపం.
స్వాతంత్య్ర భారత చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే అంబేడ్కర్‌తోపాటు సాదుల్లా వంటి రాజ్యాంగ నిర్మాతల సేవలను కూడా గుర్తించాలి. చరిత్రలో ప్రముఖులకే కాకుండా, మరుగునపడిన వ్యక్తులకూ తగిన స్థానం కల్పించినప్పుడే చారిత్రక న్యాయం జరిగినట్లవుతుంది.
