చెన్నై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై తల్లడిల్లిపోతోంది. వర్షం ధాటికి రోడ్లు జలమయం అయ్యాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా చెన్నై జల దిగ్బంధంలో చిక్కుంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మౌలిక సదుపాయాల పనులను పరిశీలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది.
మేడవాక్కం,పల్లికరణైలో గుంతలతో నిండిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. వీటిని స్థానికులు ‘డెత్ ట్రాప్స్’గా అభివర్ణించారు, ఇవి సంవత్సరాలుగా ఉన్నాయి. మరోవంక రాష్ట్రంలో భారీ వర్షపాతం కురవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. దీంతో చెన్నై జిల్లాలో నేడు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కడలూరు, విల్లుపురం, రాణిపేట జిల్లాల కలెక్టర్లు కూడా తమ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తూత్తుకుడిలో మాత్రం పాఠశాలలకు మాత్రమే సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, చెన్నైలోని ప్రసిద్ధ మెరీనా బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీవ్రమైన గాలులతో కూడిన ఎత్తైన అలలు తీరాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగవచ్చని వాతావరణ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలను పాటించాలని వారు సూచించారు.



