టెల్ అవీవ్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో గాజా చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఇజ్రాయెల్ తన భద్రతను తానే చూసుకుంటుందని, తమ దేశం అమెరికా రక్షిత ప్రాంతం కాదని నెతన్యాహు స్పష్టం చేశారు.
కాగా, వాన్స్‌తో సమావేశానికి ముందు నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతం నుంచి ఉద్భవించే భద్రతా ముప్పుకు ఇజ్రాయెల్ సమాధానం చెప్పే అవకాశాలు తగ్గిపోతాయని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. “ఇజ్రాయెల్ భద్రతను కాపాడేది ఇజ్రాయెల్ మాత్రమే. మేము ఇతర దేశాలపై ఆధారపడలేం” అని ఆయన స్పష్టం చేశారు. గాజా యుద్ధం తరువాత భవిష్యత్తు పరిపాలనపై అంతర్జాతీయ వర్గాలు వివిధ ప్రతిపాదనలు చేస్తుండగా, నెతన్యాహు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
సమావేశం ప్రారంభానికి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ…శాంతి నెలకొల్పేందుకు భారీ సవాళ్లు ఎదురుకావచ్చని వాన్స్ అంగీకరించాడు. “మన ముందు చాలా, చాలా కఠినమైన పని ఉంది, అది హమాస్‌ను నిరాయుధులను చేయడం, గాజాలోని ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు గాజాను పునర్నిర్మించడం, అలాగే ఇజ్రాయెల్‌లోని మన స్నేహితులకు హమాస్ నుంచి ముప్పు లేకుండా చూసుకోవడం. అది అంత సులభం కాదు” అని వాన్స్ అన్నారు. “చేయవలసిన పని చాలా ఉంది, కానీ మనం ఎక్కడ ఉన్నామనే దాని గురించి నేను చాలా ఆశాజనకంగా ఉన్నాను.”
వాన్స్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కూడా కలిసారు. ఆయనతో పాటు అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్‌కాఫ్,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు.
గాజాలో అంతర్జాతీయ భద్రతా దళాన్ని మోహరించడం, ఆ భూభాగాన్ని ఎవరు పరిపాలిస్తారనే దానిపై అనిశ్చితి కొనసాగుతోంది. అధికారులు భద్రతా దళం కూర్పుపై ఆలోచిస్తున్నారని, టర్కీ, ఇండోనేషియా దేశాలు దళాలను పంపాలని భావిస్తున్నట్లు వాన్స్ చెప్పారు.
కాల్పుల విరమణను పర్యవేక్షించడంలో సహాయం చేయడానికి బ్రిటన్ సైనిక అధికారుల చిన్న బృందాన్ని కూడా ఇజ్రాయెల్‌కు పంపుతోంది. వాన్స్ సమావేశం ప్రారంభమవుతుండగా, రెడ్ క్రాస్… ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించిన మరో ఇద్దరు బందీల మృతదేహాల గుర్తింపును పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
మరోవంక గాజాలో మానవతా సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ (UNRWA) కార్యకలాపాలను అనుమతించాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇజ్రాయెల్‌కు ఆదేశాలు జారీ చేసింది. హమాస్‌కు సహాయం అందిస్తోందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్ గతంలో ఈ ఏజెన్సీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.


