వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాక రిపబ్లికన్లకు తొలిదెబ్బ తగిలింది. అత్యంత కీలకంగా భావించిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి మమ్దానీ విజయం సాధించారు. కాగా, అధ్యక్షుడు ట్రంప్ కూడా న్యూయార్క్ మేయర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జోహ్రాన్ కు ఓటు వేస్తే యూదులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టే అంటూ ప్రచారం చేశారు. అయినా మమ్దానీ విజయాన్ని ఆపలేకపోయారు.
మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. 2 మిలియన్లకు పైగా న్యూయార్క్ వాసులు ఎన్నికల్లో ఓటు వేశారు. 1969 నుండి మేయర్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతంగా ఇదేనని ఎన్నికల బోర్డు తెలిపింది.
న్యూయార్క్ మేయర్‌గా తాను గెలిస్తే అద్దెలను తగ్గిస్తానని, చిన్న పిల్లల సంరక్షణ చేపడతానని, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పిస్తానని, నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలని ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశాడు. దాంతో పాటూ న్యూయార్క్ లోకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తానని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇజ్రాయెల్ వెలుపల అత్యధికంగా యూదులు నివసించేది న్యూయార్క్ లోనే కావడం గమనార్హం.
మమ్దానీ విజయంతో, న్యూయార్క్ నగరం, అమెరికా కొత్త రాజకీయ, సైద్ధాంతిక యుగంలోకి ప్రవేశించాయి, ఇప్పుడు ప్రజాస్వామ్య సోషలిస్ట్ పెట్టుబడిదారీ కోటకు నాయకత్వం వహిస్తున్నారు.
భారత సంతతికి చెందిన మమ్దానీ ప్రఖ్యాత చిత్రనిర్మాత మీరా నాయర్, కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీల కుమారుడు. అతను ఉగాండాలోని కంపాలాలో పుట్టి పెరిగాడు. ఏడు సంవత్సరాల వయసులో తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ నగరానికి వెళ్లాడు. మమ్దానీ 2018లో యూఎస్ పౌరసత్వాన్ని పొందాడు.
కాగా, గవర్నర్ ఎన్నికల్లోనూ రిపబ్లికన్లకు ఓటమి ఎదురైంది. వర్జీనియా గవర్నర్‌గా డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బెర్గర్ మొదటి మహిళా గవర్నర్ గా ఎన్నికయ్యారు.పిట్స్ బర్గ్ మేయర్ గా డెమొక్రాట్ కోరీ ఓ’కానర్ ఎన్నికలో విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి టోనీ మోరెనోను ఓ’కానర్ ఓడించారు. వర్జీనియాలో, డెమొక్రాట్ గజాలా హష్మీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో గెలిచారు, రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించారు. ఈ ఫలితాలు వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలలో, ఆ తర్వాత కూడా ప్రతిధ్వనిస్తుంది, ఈ విజయం 2026లో తిరిగి హౌస్‌పై నియంత్రణ సాధించడానికి వీలవుతుందని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు.


