Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం…42 మంది భారతీయుల దుర్మరణం!

Share It:

రియాద్‌: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 42 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. భారతీయ యాత్రికులతో ఉమ్రా పర్యటనలో ఉన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులు కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ దుర్ఘటన భారత కాలమాన ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 1:30 సమయంలో జరిగింది. ఉమ్రా యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ముఫరహత్​ ప్రాంతంలో డీజిల్​ ట్యాంకర్‌ను యాత్రికుల బస్సు ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి యాత్రికులు సజీవ దహనమయ్యారు.

కాగా, ప్రమాద సమాచారం అందిన వెంటనే సౌదీ అధికారులు, రక్షణ బృందాలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చామని అధికారులు వర్గాలు పేర్కొన్నాయి.

గల్ఫ్‌ న్యూస్ నివేదిక ప్రకారం… ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని, బస్సు ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుకున్నప్పుడు వారు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది.
బాధితుల్లో కనీసం 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారని నివేదిక పేర్కొంది. బస్సు పూర్తిగా కాలిపోయిందని, బాధితుల గుర్తింపు చాలా కష్టంగా ఉందని రెస్క్యూ బృందాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.

కాగా, ఈ దుర్ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని అధికారులను రాయబార కార్యాలయ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలని కోరారు.

ప్రమాదంలో తెలంగాణ నుండి బాధితుల సంఖ్య వివరాలను సేకరించడానికి ప్రభుత్వం రెసిడెంట్ కమిషనర్‌ను కూడా సంప్రదించింది. రాష్ట్ర సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

బాధితుల కుటుంబానికి సహాయం చేయడానికి ప్రభుత్వం కంట్రోల్ రూమ్ నంబర్‌లను కూడా జారీ చేసింది — +91 7997959754 మరియు +91 9912919545.

జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, సహాయం కోసం టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ (8002440003)ను జారీ చేసింది.

ఒవైసీ స్పందన
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బస్సు మంటల్లో చిక్కుకున్నప్పుడు అందులో 42 మంది ఉమ్రా యాత్రికులు ఉన్నారని అన్నారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ (డిసిఎం) అబూ మాథెన్ జార్జ్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, ప్రమాదం గురించి సమాచారం సేకరిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు.

హైదరాబాద్‌కు చెందిన రెండు ఏజెన్సీలు, అల్-మీనా హజ్ మరియు ఉమ్రా ట్రావెల్స్ ద్వారా ప్రయాణించిన సుమారు 16 మంది ఉమ్రా యాత్రికులు ఈ విధ్వంసకర బస్సు అగ్నిప్రమాదంలో మరణించిన వారిలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మృతదేహాలను భారతదేశానికి తీసుకురావాలని, గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని ఒవైసీ అభ్యర్థించారు.

స్పందించిన విదేశాంగ మంత్రి
ఈ దుర్ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.