Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి…గంభీర్, అగార్కర్‌ను విమర్శించిన మాజీలు!

Share It:

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. 15 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు ఇది తొలి టెస్ట్ ఓటమి. కాగా, అనూహ్య ఓటమి తర్వాత భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ సెలెక్టర్లు, జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన తర్వాత 3వ రోజున భారత్‌ను ప్రోటీస్ ఓడించింది. 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయకపోవడంతో 93 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులు ఆడిన తర్వాత మెడ గాయం కారణంగా రిటైర్ అయిన గిల్‌ను పరిశీలన కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ దారుణ ఓటమికి సెలెక్టర్లు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ కారణమని వెంకటేష్‌ ప్రసాద్‌ నిందలు వేశారు. జట్టు ఎంపికలో స్పష్టత లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు, అయితే గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టెస్టుల్లో జట్టు పేలవమైన రికార్డు కొనసాగిస్తుందని ఆయన దుయ్యబట్టారు.

“మేము వైట్-బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ… మేము అత్యుత్తమ టెస్ట్ జట్టుగా చెప్పుకోలేము. స్పష్టత లేకుండా, వ్యూహాత్మక ఆలోచన లేకుండా జట్టును ఎంపిక చేయడంతో ఎదురుదెబ్బ తగులుతున్నాయి. ఇంగ్లాండ్‌లో జరిగిన సిరీస్ డ్రాగా ముగిసిన తర్వాత, ఏడాది పాటు టెస్టుల్లో పేలవమైన ఫలితాలు వచ్చాయి” అని వెంకటేష్ ప్రసాద్‌ Xలో పోస్ట్ చేశారు.

కాగా, దక్షిణాఫ్రికాతో ఓటమిపై అభిమానులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. “స్పిన్‌ను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ల బలహీనత ఇప్పుడు పూర్తిగా బయటపడింది. మన స్పిన్నర్ల అద్భుత నైపుణ్యాల వల్ల ఇన్నాళ్లూ ఈ లోపం కనబడలేదు. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై వైట్‌వాష్ అయినా మనం పాఠాలు నేర్చుకోలేదు” అని ఓ అభిమాని ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

మరికొందరు అభిమానులు పాత తరం ఆటగాళ్లను గుర్తుచేసుకున్నారు. “పుజారా, రహానే, విరాట్ కోహ్లీ లాంటి స్పిన్ స్పెషలిస్టుల రోజులు ముగిశాయి. ప్రస్తుత బ్యాట్స్‌మెన్‌లో ఆ స్థాయి నైపుణ్యం లేదు. స్పిన్ ఉచ్చులో మనమే చిక్కుకుంటున్నాం. న్యూజిలాండ్‌తో అదే జరిగింది, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో కూడా అదే పునరావృతమైంది” అని మరో అభిమాని విమర్శించారు.

కాగా, ఈ ఓటమితో టీమిండియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. సిరీస్‌ను సమం చేయాలంటే నవంబర్ 22న గౌహతిలో ప్రారంభం కానున్న రెండో టెస్టులో తప్పక గెలిచి తీరాలి. ఈ నేపథ్యంలో భారత జట్టు తమ లోపాలను సరిదిద్దుకుని ఎలా పుంజుకుంటుందో చూడాలి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.