ఇంఫాల్: రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరణ దిశగా ముందడుగు పడింది. మైటీ, కుకీల మధ్య విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. ఈ మేరకు కుకీ జో కౌన్సిల్ ప్రతినిధి బృందంతో సీఎం ఖేమ్‌చంద్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ఒక “మంచి ప్రారంభం” అని ఆయన అన్నారు.
కుకీ జో ప్రతినిధి బృందంతో గౌహతిలో రహస్య సమావేశం జరిపిన ఒక రోజు తర్వాత, సీఎం విలేకరులతో మాట్లాడుతూ… “దాదాపు మూడేళ్లలో తొలిసారిగా కుకీ జో కౌన్సిల్,రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరగడం నిజంగా మంచి విషయం” అని అన్నారు. “చర్చలు కొనసాగుతాయని” ముఖ్యమంత్రి అన్నారు.
మే 2023 నుండి మైటీలు, కుకీ-జో వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో 260 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
శనివారం సాయంత్రం 7 గంటలకు సమావేశం ప్రారంభమై సుమారు 1 గంట 45 నిమిషాల పాటు కొనసాగిందని, ఈ సంభాషణ ప్రధానంగా ప్రతిష్టంభనను తొలగించే కార్యక్రమమని కేజెడ్‌సీ (కుకీ జో కౌన్సిల్) ఒక ప్రకటనలో తెలిపింది.
సీఎం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”మణిపూర్ పరిస్థితిలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, అంతర్గతంగా నిరాశ్రయులైన ప్రజలు తమ సొంత ఇళ్లకు తిరిగి రాలేకపోవడం అని అన్నారు.
“వారి రాకకు అత్యంత ముఖ్యమైనది రెండు వర్గాల మధ్య నమ్మకాన్ని పునర్నిర్మించడం. కేంద్ర బలగాలు ప్రజలకు ఇంకెంతకాలం కాపలా కాయగలవు? ఇప్పుడు కావలసింది ఏమిటంటే, వర్గాలు సంఘర్షణను మరచిపోయి నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడం,” అని సీఎం ఖేమ్‌చంద్ సింగ్ అన్నారు.
ఇరువైపులా నిరాశ్రయులైన ప్రజలు తమ ప్రాంతాలకు తిరిగి రావడం అనే అంశం చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని విలేకరులకు తెలిపారు.
“చర్చలకు ఆహ్వానాన్ని అంగీకరించినందుకు కుకీ జో కౌన్సిల్‌కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంతో మేము చర్చలు జరిపాము.
“శాంతిని పునరుద్ధరించి, క్షమాభావనతో ముందుకు సాగాలని అందరికీ నా విజ్ఞప్తి. శాంతిని నెలకొల్పడం, నమ్మకాన్ని పెంపొందించడమే నా విధానం. ఇందులో ఎలాంటి డిమాండ్ గానీ, కట్టుబాటు గానీ లేదు,” అని సింగ్ అన్నారు.
ప్రత్యేక పరిపాలన డిమాండ్‌పై మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, “మణిపూర్ ప్రాదేశిక సమగ్రత చెక్కుచెదరకుండా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు” అని ఆయన అన్నారు.
బఫర్ జోన్ల పదం గురించి సీఎం మాట్లాడుతూ, “ప్రభుత్వానికి బఫర్ జోన్ అంటూ ఏమీ లేదు. చర్చల సమయంలో నేను దానిని సున్నితమైన ప్రాంతం (సెన్సిటివ్ జోన్) అని ప్రస్తావిస్తాను” అని అన్నారు. నమ్మకం లేకపోవడంతో, భద్రతా దళాలు అటువంటి సున్నితమైన ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
అయితే, “ఇప్పుడు ఎలాంటి ఘర్షణకూ సమయం కాదు. మనం శాంతిని నెలకొల్పాలనుకుంటే, నిజాయితీగా పనిచేయాలి. మరీ ముఖ్యంగా, ‘ఎవరో ఇలా అన్నారు, ఎవరో అలా అన్నారు’ అనే వాటిపై దృష్టి పెట్టకూడదు” అని ఆయన నొక్కి చెప్పారు.
మరోవైపు, శనివారం గౌహతిలో జరిగిన సమావేశంలో తమ ప్రతినిధి బృందం అనేక కీలక సమస్యలను లేవనెత్తిందని, వాటన్నిటినీ ముఖ్యమంత్రి శ్రద్ధగా విన్నారని కుకీ జో కౌన్సిల్ తెలిపింది.
“వీటిలో కుకీ,తంగ్‌ఖుల్ వర్గాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు ఇరువర్గాల మధ్య అర్థవంతమైన శాంతి నెలకొనాలి. ముందస్తు షరతుగా సంఘర్షణ బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన ఆవశ్యకత ప్రముఖమైందని” కుకీ జో కౌన్సిల్ పేర్కొంది.
రాజకీయ పరిష్కారం లభించే వరకు బఫర్ జోన్ పవిత్రతను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రతినిధి బృందం నొక్కిచెప్పిందని, అలాగే ఈ ప్రాంతంలో సుస్థిరమైన, శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు కొనసాగుతున్న ‘సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్’ చర్చలకు త్వరితగతిన ఒక తీర్మానాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా నొక్కిచెప్పిందని కుకీ జో కౌన్సిల్ (KZC) ప్రకటన తెలిపింది.
“దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి, మణిపూర్‌లో శాంతిని, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారితో పంచుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో తనతో సంప్రదింపులు జరపడంలో KZC తీసుకున్న చొరవను, సాహసోపేతమైన చర్యను ఆయన ఎంతగానో ప్రశంసించారని” ఆ ప్రకటన పేర్కొంది.
