కోల్‌కత: భారతీయ జనతా పార్టీ (BJP) పతనం ప్రారంభమైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ… మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ బీజేపీ తరపున అక్రమ ప్రచారానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
“బీజేపీ రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ఉల్లంఘన అవుతుందని”ముఖ్యమంత్రి అన్నారు.
శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, భ్రూణహత్యల పాపానికి గాను భారతదేశ మహిళలు కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపక్షాలను కఠినంగా శిక్షిస్తారని ప్రధానమంత్రి మోదీ హెచ్చరించారు.
దీనికి స్పందనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ… “మీరు (ప్రధానమంత్రి మోదీ) మీ పార్టీ కోసం అక్రమ ప్రచారం చేస్తున్నారని భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు సెప్టెంబర్ 2023లో ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దానిని ఎందుకు అమలు చేయలేదు? అని ప్రశ్నించారు.”
లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టంతో పాటు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జతచేసిందని ఆమె పేర్కొన్నారు.
“బిల్లును ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, లోక్‌సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టే సాహసం వారు (BJP) చేశారు. లోక్‌సభలో వారికి ఓటమి ఎదురైంది. బీజేపీ పతనం ప్రారంభమైంది,” అని ఆమె అన్నారు.
ఆదివారం తన ప్రసంగంలో, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సందేశాన్ని వినిపించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు.
“లోక్‌సభలో తీర్పు వెలువడింది. వారు (BJP) ఓడిపోయారు. ఈ (BJP నేతృత్వంలోని కేంద్ర) ప్రభుత్వం మనుగడ సాగించలేదు. పతనం ప్రారంభమైంది. ఇది కూలిపోక తప్పదు,” అని ఆమె అన్నారు.
పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌కు సంబంధించి మమతా బెనర్జీ మాట్లాడుతూ… “మాలో (తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలలో) ఎనిమిది మంది వెళ్లలేకపోయాము. శివసేన సభ్యులు కూడా వెళ్లలేకపోయారు. మరో 25-30 మంది కూడా హాజరు కాలేకపోయారు. ఒకవేళ అందరూ హాజరై ఉంటే, ఆ సంఖ్యలను కూడి చూడండి, బీజేపీ ఘోరంగా ఓడిపోయేదని మమత అన్నారు.”
