హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని గుట్టుగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 2.15 కోట్లు. కాగా, దీని మొత్తం బరువు 6.15 కిలోలు కావడం గమనార్హం. ఈ కేసులో ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చేపట్టిన భారీ దాడుల్లో భాగంగా, డీఆర్ఐ (DRI) అందించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, కస్టమ్స్ హైదరాబాద్కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు సోమవారం బ్యాంకాక్ నుంచి వస్తున్న ఒక భారతీయ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
అతని సామానును తనిఖీ చేయగా, ఆకుపచ్చని ఆకుల పదార్థం ఉన్న 16 సీల్డ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలో ఆ పదార్థం హైడ్రోపోనిక్ గంజాయి అని, ఇది NDPS చట్టం 1985 పరిధిలోకి వచ్చే మాదకద్రవ్యమని తేలిందని ఆ ప్రకటన పేర్కొంది.
అక్రమంగా రవాణా అవుతున్న ఈ సరుకు నికర బరువు 6.15 కిలోలు, దీని విలువ మార్కెట్లో రూ. 2.15 కోట్లు. తదనంతరం, దానిని స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని అరెస్టు చేశారు.
