న్యూఢిల్లీ: గ్రేట్ నికోబార్ ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు దేశంలో జరిగిన “అతిపెద్ద కుంభకోణాలలో” ఒకటని రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ది ముసుగులో వేల ఏళ్ల నాటి అడవులను నరికివేస్తూ.. పర్యావరణ విధ్వంసం చేస్తుందని లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గ్రేట్ నికోబార్ లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితులపై ఎక్స్ వేదికగా ఈరోజు ట్వీట్ చేశారు
బంగాళాఖాతంలోని అండమాన్,నికోబార్ ద్వీపసమూహంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గాంధీ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు అపారమైన ‘రక్షణ ప్రాముఖ్యత’,’జాతీయ భద్రత’ ఉన్నాయని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం ఒక అంతర్జాతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, ఒక టౌన్‌షిప్, ఒక విద్యుత్ ప్లాంట్, ఒక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల 130 చదరపు కిలోమీటర్ల పచ్చని వర్షారణ్యం నాశనం కావడంతో పాటు, పగడపు దిబ్బలు, తాబేళ్ల గూడు కట్టే ప్రదేశాల విధ్వంసం కూడా అవుతాయని రాహుల్ గాంధీ అన్నారు.
‘అదానీ కలను నెరవేర్చడానికి’
నా జీవితంలో నేను చూసిన అత్యంత అందమైన అడవులు ఇవి, అంతేకాదు జ్ఞాపకాలకు అందని పురాతనమైన చెట్లు ఇవేనని రాహుల్ అన్నారు. ఈ వృక్షాలు పెరగడానికి తరతరాలు పట్టి ఉంటందని గుర్తు చేశారు. ఈ ద్వీపంలోని ప్రజలు కూడా అంతే అందంగా ఉంటారు అని, ఆదివాసీ సమాజాలు, వలసదారులు ఇద్దరూ నివసిస్తున్నారని.. కానీ వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన వాటిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ నివసించే ప్రజలను పూర్తిగా విస్మరించి, భారతదేశ పర్యావరణానికి కలిగించబోయే నష్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా” ఈ చెట్లన్నింటినీ నరికివేయబోతున్నారని ఆయన అన్నారు.
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దీని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులతో ముందుకు వెళ్తోందని కూడా ఆయన ఆరోపించారు. “ఒక వ్యాపారవేత్త అయిన అదానీ తన కోరికలను తీర్చుకోవడం కోసం 160 చదరపు కిలోమీటర్ల ఈ అడవిని నరికివేయడం ఆశ్చర్యకరం. ఇక్కడి కలప విలువ లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని” రాహుల్ గాంధీ అన్నారు.
“ఇప్పటివరకు జరిగిన భారతీయ ఆస్తుల, పర్యావరణ ఆస్తుల దొంగతనాలలో ఇది బహుశా అతిపెద్ద కుంభకోణాలలో ఒకటని” కాంగ్రెస్ అగ్రనేత అన్నారు.
ది హిందూ పత్రిక నివేదిక ప్రకారం, ఏప్రిల్ 28న క్యాంప్‌బెల్ బేలోని రాజీవ్ నగర్‌లో గాంధీ నికోబరీస్ కమ్యూనిటీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 92వేల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుపై… తమ ఆందోళనలను, భయాలను ఆ ద్వీపవాసులు వివరించారు. నివేదిక ప్రకారం… ఈ సమస్యలను ప్రస్తావించడానికి ఆ ద్వీపం నుండి ఒక ప్రతినిధి బృందం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన కొన్ని వారాల తర్వాత ఆయన ఆ ద్వీపాన్ని సందర్శించారు.
ఈ ద్వీపంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నారని, ఈ ప్రాజెక్టు గురించి తమను అడగలేదని, తమ భూమికి ఎలాంటి పరిహారం లభిస్తుందో కూడా తమకు తెలియదంటన్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
“ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న అభివృద్ధిని ‘ప్రాజెక్టు’ అని చెబుతోంది. నేను చూసింది ప్రాజెక్టు కాదు,” “ గొడ్డలి వేటుకు గురైన లక్షలాది చెట్లు. ఫలితంగా 160 చదరపు కిలోమీటర్ల వర్షారణ్యం నాశనం అయిందని రాహుల్‌గాంధీ X పేజీలో రాశారు.. ప్రాజెక్టు పేరు చెప్పి ప్రజల ఇళ్లను లాక్కుంటూ, వారిని పట్టించుకోకుండా వదిలేయడం అభివృద్ధి కాదు. ఇది అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విధ్వంసం. అందుకే గ్రేట్ నికోబార్‌లో జరుగుతున్నది మన జీవితకాలంలో ఈ దేశ సహజ, గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాలలో ఒకటి రాహుల్ గాంధీ అన్నారు.”
నేను చూసినదాన్ని భారతీయులు కూడా చూడాలని ఎంచుకుంటే ఈ విధ్వంసాన్ని ఆపేందుకు ముందుకొచ్చి పోరాడాలని సూచించారు.
కాగా, రాహుల్ గాంధీ నికోబార్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలు విధించింది. చెన్నై ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ జారీ చేసిన ‘నోటీస్ టు ఎయిర్‌మెన్’ కారణంగా, నికోబార్ దీవుల సమూహానికి హెలికాప్టర్ సేవలను ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలిపివేసినట్లు ఏప్రిల్ 27న నికోబార్ టైమ్స్ నివేదించింది. నివేదిక ప్రకారం, ఈ తాత్కాలిక సేవల నిలిపివేత దీవుల మధ్య అనుసంధానాన్ని, ముఖ్యంగా హెలికాప్టర్ రవాణాను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ పర్యటన సమయంలోనే ఆంక్షలు జారీ చేయడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. “నేను ఇక్కడికి రావడం ప్రభుత్వం ఎందుకు ఇష్టపడలేదో ఇప్పుడు నాకు అర్థమైందని రాహుల్ గాంధీ తన వీడియో పోస్ట్‌లో అన్నారు. “నన్ను ఇక్కడికి రాకుండా ఆపడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత కసరత్తు చేసిందో కూడా అర్థమైంది. ఇది పచ్చి దొంగతనం, ఇంకా ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఇది చూడాలని నేను కోరుకుంటున్నాను,” అని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తమని స్థానిక వర్గాలు, గిరిజనులు, రక్షణ దళాల నుండి వచ్చిన వలసదారులు తనను కోరారని ఆయన అన్నారు. “ఈ వ్యక్తులు దీన్ని రహస్యంగా, దొంగచాటుగా చేస్తున్నారు, ఈ విషయాన్ని యావత్ దేశానికి, ముఖ్యంగా యువతకు చెప్పాలి, ఎందుకంటే ఇదే మీ భవిష్యత్తు” అని గాంధీ తన వీడియో పోస్ట్‌లో పేర్కొన్నారు.
