Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇరాన్‌తో శాంతి ఒప్పందం…సౌదీ, పాక్ అబ్రహం ఒప్పందంలో చేరాలని కోరుకుంటున్న ట్రంప్!

Share It:

వాషింగ్టన్: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, ఈజిప్ట్, జోర్డాన్, టర్కీ సహా ఆరు ముస్లిం-మెజారిటీ దేశాలు అబ్రహం ఒప్పందాలలో మూకుమ్మడిగా చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబట్టారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను దీనికి ఒక కీలక షరతుగా ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు, ఇరాన్‌తో కుదురుతున్న ఒప్పందాన్ని ఈ ఒప్పందాలతో ముడిపెట్టడానికి ప్రయత్నించడం ఇది రెండోసారి. ఈ ఒప్పందాలపై మొదటగా సెప్టెంబర్ 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ సంతకాలు చేయగా, ఆ తర్వాతి నెలల్లో మొరాకో, సూడాన్‌లు కూడా చేరాయి.

ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందాలలో చేరడం గురించి తాను ఆ దేశాల నాయకులతో గత శనివారంమాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. “ఈ సంక్లిష్టమైన చిక్కుముడిని విప్పడానికి అమెరికా చేసిన కృషి ఫలితంగా, ఈ దేశాలన్నీ కనీసం ఏకకాలంలో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడం తప్పనిసరి అని నేను పేర్కొన్నాను,” అని ఆయన తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో రాశారు.

యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదిరిన తర్వాత, ఇరాన్‌ను తమ ఒప్పందాలలో భాగంగా చేర్చుకోవడం ఆ దేశాలకు “గౌరవప్రదంగా” ఉంటుందని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

అబ్రహం ఒప్పందాలు అంటే ఏమిటి?
అబ్రహం ఒప్పందాలు అనేవి ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి కుదిరిన ఒప్పందాల సమాహారం. ఒక చారిత్రాత్మక దౌత్య పరిణామంలో, వైట్‌హౌస్‌లో ట్రంప్ మొదటి పదవీకాలంలో అబుదాబి, మనామా దీనిపై సంతకం చేశాయి. తద్వారా, చాలాకాలంగా ఉన్న నిషేధాన్ని బద్దలు కొట్టి, పావు శతాబ్దంలో ఇజ్రాయెల్‌ను గుర్తించిన మొదటి అరబ్ దేశాలుగా నిలిచాయి. ట్రంప్ యూదు అల్లుడు, జారెడ్ కుష్నర్, ఈ ఒప్పందాలను కుదర్చడంలో సహాయపడ్డారు.

తరువాత, వేర్వేరు ఒప్పందాల ద్వారా, 2020, 2021లో మొరాకో మరియు సూడాన్ ఈ ఒప్పందంలో చేరాయి. ఇటీవలే, 2025లో కజకిస్తాన్ కూడా చేరింది. ఈ ఒప్పందాలు లేకుండా, ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించిన రెండు ముస్లిం-మెజారిటీ దేశాలుగా ఈజిప్ట్,జోర్డాన్ మాత్రమే ఉండేవి.

ప్రత్యేక పాలస్తీనా రాజ్యం ఏర్పడేంత వరకు టెల్ అవీవ్‌తో సంబంధాలు నెలకొల్పలేమని అరబ్ దేశాలు చాలా కాలంగా చెబుతూ వచ్చాయి.
పాలస్తీనా రాజ్యం ఏర్పాటు దిశగా పురోగతిని మొదట డిమాండ్ చేయకుండా ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా తమ అరబ్ సోదరులు తమను మోసం చేశారని భావిస్తున్నట్లు పాలస్తీనా నాయకులు ఈ ఒప్పందాలను ఖండించారు. ఈ ఒప్పందాలు పాకిస్థాన్‌లో నిరసనలకు దారితీశాయి. ఇరాన్ నుండి విమర్శలను ఎదుర్కొన్నాయి. ఇరాన్ వీటిని పాలస్తీనియన్లకు ద్రోహంగా, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా అభివర్ణించింది.

ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్ లాభపడింది
ఈ ఒప్పందాలలో ఇజ్రాయెల్‌కు లభించిన అతిపెద్ద బహుమతి, ప్రపంచంలోనే ఒక ప్రధాన చమురు ఉత్పత్తిదారు, మధ్యప్రాచ్యం అంతటా దౌత్యపరమైన పలుకుబడి కలిగిన వాణిజ్య, వ్యాపార కేంద్రమైన యూఏఈతో కుదిరిన ఒప్పందం. అప్పటి నుండి టెల్ అవీవ్, అబుదాబి, రక్షణ సహకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో సహా సన్నిహిత ఆర్థిక మరియు భద్రతా సంబంధాలను అభివృద్ధి చేసుకున్నాయి. కానీ ఇటీవల ఈ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.

అమెరికా ప్రణాళిక
వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులు వంటి రంగాలలో పురోగతి సాధిస్తే, ఈ ఒప్పందాలు ఇతర అరబ్ దేశాలకు, అన్నింటికంటే ముఖ్యంగా, సౌదీ అరేబియాకు కూడా విస్తరిస్తాయని వాషింగ్టన్ చాలా కాలంగా ఆశతో ఉంది. కానీ, పాలస్తీనా దేశం ఏర్పాటుకు స్పష్టమైన మార్గం లేకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవని రియాద్ పట్టుబట్టింది.

కాగా, 2023 అక్టోబర్‌లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి, గాజాలో పదివేల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హతమార్చిన యుద్ధానికి దారితీసినప్పటి నుండి, అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు మరింత దూరమయ్యాయి. అరబ్ దేశాలలో ప్రజాభిప్రాయం మరింత ఆగ్రహంగా మారింది.

అయినప్పటికీ, మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఈ సంవత్సరం తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇద్దరి హయాంలోనూ, యుద్ధాన్ని ముగించడానికి భవిష్యత్తులో చేపట్టే ఏ ప్రాంతీయ పరిష్కారంలోనైనా ఇజ్రాయెల్‌ను అరబ్ దేశాలు విస్తృతంగా గుర్తించడాన్ని… వాషింగ్టన్ ఒక అంతిమ లక్ష్యంగా ప్రోత్సహించింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.