న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల సవరణలో భాగంగా ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల లక్ష్యంతో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధమేనని కోర్టు పేర్కొంది. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రక్షాళన తప్పనిసరి అని, ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
అలాగే సందేహాస్పద పౌరసత్వం కారణంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వ్యక్తుల పేర్లను నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.
ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ప్రస్తుత రూపంలో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయా లేదా అని కోర్టు పరిశీలించిందని లైవ్ లా నివేదించింది. అంతేకాదు ‘ఎస్ఐఆర్ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలనే రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని భావిస్తున్నాం. ఈ ప్రక్రియ ప్రస్తుత ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడం లేదు. ఇక ఆర్టికల్ 324 కింద రాజ్యాంగ ఆదేశానికి జీవం పోస్తోంది. ఎన్నికల కమిషన్ తన చట్టబద్ధమైన అధికారాలను అతిక్రమించి వ్యవహరించిందని చెప్పలేం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
“స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను నిర్ధారించే రాజ్యాంగ లక్ష్యంతో” ఈ ప్రత్యేక పునర్విమర్శకు “ప్రత్యక్ష సంబంధం” ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినవి మాత్రమే కాదని, అవి ప్రాథమికంగా “ప్రజాస్వామ్య ప్రక్రియకు పునాది వేసిన ఓటర్ల జాబితాల సమగ్రత, కచ్చితత్వం, విశ్వసనీయత”పై ఆధారపడి ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇంకా, చివరి ఎస్‌ఐఆర్ జరిగి నాలుగు దశాబ్దాలకు పైగా గడిచిపోవడం, సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరగడం, వేగవంతమైన పట్టణీకరణ, వలసల కారణంగా ఓటర్ల జాబితాలో నకిలీలు, తప్పులు ఏర్పడే అవకాశం వంటి ఈసీ పేర్కొన్న కారణాలన్నీ “ఆ ప్రాథమిక సమగ్రతను పరిరక్షించడం” కోసమేనని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
కాగా, బీహార్‌లో ఎస్ఐఆర్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిన తర్వాత, గత ఏడాది జూన్‌లో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, పార్లమెంట్ సభ్యులు మహువా మోయిత్రా , మనోజ్ ఝా, కేసీ వేణుగోపాల్,సుప్రియా సూలే ఉన్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఎస్ఐఆర్ మొదటి రెండు విడతలు వివాదాలతో నిండిపోయాయి. పశ్చిమ బెంగాల్‌లో, ఎన్నికలకు రెండు వారాల కన్నా తక్కువ సమయం ఉండగా, 27 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యం 19 న్యాయ ట్రిబ్యునళ్లలో తేలడం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా మధ్యంతర ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. చివరికి, పోలింగ్ రోజుకు ముందు ఈ ట్రిబ్యునళ్లు అతి కొద్ది కేసులపై మాత్రమే తీర్పునిచ్చాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ… “ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలను రూపొందించే ఒక నమూనాని ప్రవేశపెట్టింది. ఈ దేశంలో ఓటర్లే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మాకు తెలుసు. ఎస్ఐఆర్ ఆ ప్రక్రియను తలక్రిందులు చేసింది. ఇప్పుడు ఓటర్లుగా ఎవరు ఉండాలో ప్రభుత్వమే నిర్ణయించగలదు. ఒకసారి దానిని ఆమోదిస్తే, అది ప్రజాస్వామ్య భావననే పూర్తిగా తలక్రిందులు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.”
ఇక మే 14న, 16 రాష్ట్రాలు,మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ మూడవ దశకు ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియలో సుమారు నాలుగు లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులు 367 మిలియన్ల ఓటర్లను పరిశీలిస్తారు.
