Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

కాంగ్రెస్ ప్రతిపాదించిన తెలంగాణ రైతు డిస్కమ్‌ను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్!

Share It:

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ అయిన తెలంగాణ రైతు డిస్కమ్‌ను ప్రతిపక్షాలు, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వారి వాదన ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంపైనే కేంద్రీకృతమై ఉంది.

కొత్తగా, మూడవ డిస్కమ్ ఏర్పాటుకు లైసెన్సు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తుపై మే 29న విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిపక్షాలు, అధికార కాంగ్రెస్ వాదోపవాదాలు చేసుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గం కొత్త డిస్కమ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది.

ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏదో అదృశ్య శక్తి ప్రభావం చూపిందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఉద్దేశించిన విద్యుత్‌ను ఇతర అవసరాలకు దుర్వినియోగం చేయడాన్ని అరికట్టడానికే కొత్త డిస్కామ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ సాకును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు..

కొత్త డిస్కామ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 1,000 మంది ఉద్యోగులను నియమించాలని యోచిస్తోందని, వారు 29 లక్షల మంది రైతులను (వినియోగదారులను) ఎలా నిర్వహించగలరని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

“వారి డిప్యుటేషన్ ప్రకారం 15 గ్రామాలకు ఒక లైన్‌మ్యాన్ ఉంటాడు. ఆ 15 గ్రామాల నుంచి రైతులందరూ ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తి ఎలా పరిష్కరిస్తాడు? ఆ లైన్‌మ్యాన్ దగ్గర్లోని గుడిలో పూజ చేసుకుంటే సరిపోతుంది,” అని జగదీష్‌రెడ్డి చమత్కరించారు.

ప్రస్తుతం ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలు (Discoms) ఇప్పటికే వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ఎత్తిచూపుతూ, అప్పుల భారంతో సతమతమవుతున్న కొత్త ‘రైతు డిస్కం’ ఆర్థిక సంస్థల నుండి రుణాలు ఎలా ఆశించగలదని, అసలు ఆ రుణాలు ఎలా మంజూరు అవుతాయని మాజీ మంత్రి ప్రశ్నించారు.

ఉచిత విద్యుత్ పథకాలకు వెచ్చిస్తున్న నిధులను భర్తీ చేయడానికి, వాణిజ్య, గృహ, ఇతర కనెక్షన్ల నుండి బకాయిలను వసూలు చేయడం ద్వారా ‘క్రాస్ సబ్సిడీ’ పద్ధతిలో డిస్కంలు పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. ఇటువంటి లావాదేవీలలో వసూళ్ల శాతం 99.9గా ఉందని ఆయన పేర్కొన్నారు.

“అటువంటప్పుడు, కొత్త డిస్కంను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వపు ఈ చర్య వల్ల కేవలం ఒక కొత్త CMD కార్యాలయం ఏర్పాటు కావడం, వ్యవసాయ బోరుబావుల మోటార్లకు అమర్చే కొత్త మీటర్ల ఖర్చును భరించడం తప్ప వేరే ఫలితం ఉండదు,” అని ఆయన ఆరోపించారు.

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి కూడా ఈ విషయంపై విస్తృతంగా మాట్లాడారు. సూటి ప్రశ్నలను సంధించారు.
“గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ భూమిలోనే ఇల్లు కట్టుకుని నివసించడం మనం చూస్తుంటాం. ఆ ఇంట్లో విద్యుత్ సంబంధిత సమస్య తలెత్తితే, ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం రైతు ‘రైతు డిస్కం’ను సంప్రదించాలా లేక ఇతర డిస్కంలను సంప్రదించాలా?” అని ఆయన ప్రశ్నించారు.

కాగా, ఈ విషయపై తెలంగాణ రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కొదండ రెడ్డి క్లుప్తంగా మాట్లాడారు. ‘రైతు డిస్కం’కు లైసెన్స్ మంజూరు చేయాలని ERCని అభ్యర్థించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అంశంపై స్పందిస్తూ, ఒక రైతుగా తనకు రోజుకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని, కేవలం 3 గంటల నిరంతర విద్యుత్ సరఫరా లభించినా చాలని తాను సంతృప్తి చెందుతానని ఆయన పేర్కొన్నారు.

BRS పదేళ్ల పాలనలో జరిగిన ERC ప్రజా విచారణల సందర్భంగా, పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులను అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నించారని, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సమావేశాలు నిర్వహించే స్థితిలో ఆ కమిషన్ లేకపోయిందని ఆయన గుర్తుచేశారు.

గతంలో కొన్ని సిఫార్సుల ఆధారంగా రైతుల విద్యుత్ కనెక్షన్‌కు నెలకు నామమాత్రపు రుసుముగా రూ. 30 విధించినప్పుడు, ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్న 29 లక్షల మంది రైతుల వివరాలు బయటకు రావడం కాంగ్రెస్ పార్టీ చేసిన నిరంతర కృషి వల్లే సాధ్యమైందని కోదండ రెడ్డి గుర్తుచేశారు.

కాగా ఈ విషయమై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…2014 నుండి 2024 మధ్య కాలంలో, దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థల (Discoms) సమగ్ర ర్యాంకింగ్స్‌లో TGSPDCL 9వ స్థానం నుండి 52వ స్థానానికి పడిపోయిందని, అలాగే TGNPDCL 16వ స్థానం నుండి 42వ స్థానానికి దిగజారిందని కిరణ్ కుమార్ పేర్కొన్నారు.

రైతులను దొంగలుగా చూస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణల విషయమై స్పందిస్తూ, “ఉచిత విద్యుత్ పథకం కింద రైతులు అసలు విద్యుత్ బిల్లులే చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు, వారు విద్యుత్ దొంగతనం చేసే ప్రసక్తే ఎక్కడ వస్తుంది?” అని ఆయన ఎదురు ప్రశ్నించారు. నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ప్రభుత్వం—ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి (BRS)—కేంద్రం ప్రవేశపెట్టిన ‘నవీకరించిన పంపిణీ రంగ పథకం’ (RDSS) కింద స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడానికి 2017 జనవరి 4న అంగీకరించిందని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, అన్ని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియలను కూడా నాటి BRS ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు (Discoms) మోస్తున్న భారీ రుణభారం కారణంగా వాటి విశ్వసనీయత దెబ్బతిందని, ఆ రుణాల నుండి వాటిని విముక్తం చేయాల్సిన అవసరం ఏర్పడటంతోనే, ఒక కొత్త డిస్కామ్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని భువనగిరి ఎంపీ తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.