లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక యానిమేషన్ సెంటర్ ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో, 15 మంది విద్యార్థులను మృతి చెందారు, మరో ఏడుగురు గాయపడ్డారని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు.
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లోని ట్రామా సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ఘటన అనంతరం సుమారు 21 నుంచి 22 మంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. “పదిహేను మందిని చనిపోయిన స్థితిలో తీసుకువచ్చారు. విచారణ ప్రక్రియలు పూర్తయిన తర్వాత, వారిని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం మార్చురీకి పంపుతాము,” అని అగర్వాల్ అన్నారు.
గాయపడిన ఏడుగురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. అధికారి ప్రకారం, ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. “ఇద్దరు పిల్లలు కిందకు దూకడంతో వారి వెన్నుకు గాయాలయ్యాయి, దీంతో వారికి సీటీ స్కాన్‌లు, ఇతర ప్రక్రియల అనంతరం చికిత్స అందిస్తున్నారు,” అని ఆయన అన్నారు.
లక్నోలోని ఒక వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించి, ప్రాంగణమంతా వేగంగా వ్యాపించింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు, జిల్లా పరిపాలన అధికారులు పాల్గొన్న భారీ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. కాగా, మంటలు చెలరేగడానికి గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, సహాయక, గాలింపు చర్యలు కూడా కొనసాగాయి. ఈ ఘటనపై, అలాగే ఏవైనా భద్రతా లోపాలు ఉన్నాయేమోనని రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
