హైదరాబాద్: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) దృష్ట్యా, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐల) ఓటు హక్కులను పరిరక్షించాలని సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) అధ్యక్షుడు శ్రీనివాస్… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కోరారు.
విదేశాలలో నివసిస్తున్న పౌరులకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవగాహన ప్రచారాలు నిర్వహించాలని, ఆన్లైన్ ఓటరు నమోదు, సంబంధిత సేవలను బలోపేతం చేయాలని శ్రీనివాస్ కోరారు.
భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR ఇంటింటా సర్వే సమయంలో.. ప్రవాసీయులు తమ స్వగ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో వారి ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో స్థానికంగా లేరన్న కారణంతో విదేశాల్లో ఉన్న వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించవద్దని సౌదీ అరేబియా తెలుగు సంఘం కోరింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతిలో ప్రవాస తెలుగు సమాజాలు కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యలను పరిష్కరించి, ఓటు హక్కుతో సహా వారి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఓటర్ల గణన ప్రక్రియ కొనసాగుతోంది, ఇది జూలై 14 వరకు కొనసాగుతుంది. తెలంగాణలో, గణన జూన్ 25న ప్రారంభమై జూలై 24 వరకు జరుగుతుంది.
