…..కునాల్ ఛటర్జీ
తమ ప్రభుత్వం ఇప్పటికే 10,000 మంది బంగ్లాదేశీయులను దేశం నుండి బహిష్కరించిందని జూన్ 23న రాష్ట్ర శాసనసభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి చేసిన ప్రకటనను ఎవరూ సవాలు చేయలేదు. న్యూఢిల్లీ, ఢాకా లేదా సరిహద్దు భద్రతా దళం (BSF) నుండి ఎటువంటి ధృవీకరణ లభించలేదు. తిరుగుబాటు టీఎంసీ నాయకులతో కూడిన రాష్ట్ర ప్రతిపక్షం కూడా ఈ వాదనను ప్రశ్నించలేదు.
భారతీయ ముస్లింలను బంగ్లాదేశ్‌లోకి నెట్టివేయడానికి బీఎస్ఎఫ్ చేసిన కనీసం 30 ప్రయత్నాలను తాము భగ్నం చేశామని బంగ్లాదేశ్ సరిహద్దు దళాలు (BBG) వెల్లడించాయి. బహిష్కరణకు గుర్తింపు, విచారణ అవసరమని ఢాకా నొక్కి చెప్పింది, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన అధికారిక విధానాలకు కట్టుబడి ఉండకుండా, నిరాసక్తంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ “పత్రాలు లేని బంగ్లాదేశీయులు” సరిగ్గా ఎవరు? వారు ఎక్కడ నివసించారు, పనిచేశారు, పౌరసత్వ పత్రాలను ఎలా పొందారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు, రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నివసిస్తున్న భారతీయ ముస్లింలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఈవిషయమై ముర్షిదాబాద్‌కు చెందిన 32 ఏళ్ల వాసిప్ బిస్వాస్ మీడియాతో మాట్లాడుతూ…మే 9న సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘బంగ్లాదేశీలు’గా ప్రకటించి, నిర్బంధ కేంద్రానికి పంపిన మాల్దాకు చెందిన 12 మంది ముస్లింల ఉదంతాన్ని వివరించారు. “వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు,” అని ఆయన అన్నారు.
బిస్వాస్, బీఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న అతని అన్నయ్య, ఎస్ఐఆర్ (ప్రత్యేక విస్తృత సవరణ)లో ఓటరు జాబితా నుండి పేర్లు తొలగించిన 27 లక్షల మంది ఓటర్లలో ఉన్నారు. వీరిలో అధిక సంఖ్యలో ముస్లింలే ఉన్నారు. వారి ఆన్‌లైన్ అప్పీళ్లపై ఎలాంటి సమాచారం లేదు. ఈలోగా, సంక్షేమ పథకాలు,ఇతర ప్రయోజనాలను కోల్పోతామనే భయంతో వారు జీవిస్తున్నారు.
చట్టం ప్రకారం పేర్లను తొలగించే ముందు లిఖితపూర్వక వివరణ, వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి, అయినప్పటికీ వారి పేర్లను ఎందుకు తొలగించారో ఎవరికీ తెలియదు. ముర్షిదాబాద్‌కు చెందిన 75 ఏళ్ల ముస్లిం న్యాయవాది, ఓటర్ల జాబితా నుండి తొలగించటంతో, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఆయన భారతీయ న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అనడానికి తగినంత సాక్ష్యం ఉందని కోర్టు నామమాత్రంగానే అంగీకరించి, పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతగా పలుకుబడి లేని పౌరుడికి ఇంకే మార్గం ఉంటుంది?
నిరసనలు సద్దుమణిగాయి. కోల్‌కతాలో కూడా. మే నెల వరకు పార్క్ సర్కస్ మైదాన్‌లో జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్న ప్రొఫెసర్ ఖాజీ మొహమ్మద్ ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ, “ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు కార్యకర్తలందరూ ఏదైనా చేసే ముందు రెండుసార్లు ఆలోచించాలి” అని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో బాగా డబ్బున్న ముస్లింలు సైతం అభద్రతాభావంతో ఉన్నారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి షాహిదుల్లా మున్షీ ఉదంతం దీనికి నిదర్శనం. ‘ లాజికల్ డిఫెరెన్సెస్’ కారణంగా అతన్ని, అతని కుటుంబ సభ్యులను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. అయినప్పటికీ, బార్ & బెంచ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత 48 గంటల్లోపే అతని ఓటు హక్కు పునరుద్ధరించారు. కానీ, ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో బోధిస్తూ, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉన్న ఆక్స్‌ఫర్డ్ విద్యావంతుడైన మానవ శాస్త్రవేత్త ఆదిల్ హుస్సేన్ అంత అదృష్టవంతుడు కాదు; అతని పేరు పునరుద్ధరించలేదు. “ఓటు హక్కు లేని వారి కోసం వారు ఎలాంటి నిబంధనలు చేస్తారో మాకు తెలియదని ఆయన మీడియాతో అన్నారు.
బెంగాల్‌లోని ముస్లింలు తాము ఇంత అభద్రతాభావంతో ఎప్పుడూ లేమని అంగీకరిస్తున్నారు. తరతరాలుగా మరుగునపడిన 1946-47 అల్లర్ల జ్ఞాపకాలు ఇప్పుడు తిరిగి వస్తున్నాయి. కలకత్తా విశ్వవిద్యాలయపు మొదటి ముస్లిం వైస్-ఛాన్సలర్ పేరు మీద ఉన్న సుహ్రావర్ది అవెన్యూను, హిందువుల రక్షకుడిగా పేరొంది…అల్లర్ల కారకుడైన గోపాల్ ముఖర్జీ డ్‌గా మార్చడం అలాంటి ఒక చర్య. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జూలై 6 నుండి ఒక సంవత్సరం పాటు జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం మరొకటి.
మత విద్వేష వైరస్ వ్యాపిస్తోంది. పదేళ్ల షేక్ అజిజుల్‌ను తోటి విద్యార్థులు ‘ద్రోహి’, ‘పాకిస్తానీ’ అని ఎగతాళి చేశారు పాఠశాల నుండి వణికిపోతూ ఇంటికి వచ్చాడు. గార్డెన్ రీచ్ వంటి ముస్లిం నివాస ప్రాంతాలలో, ప్రజలు ఒక కొత్త వాస్తవికత గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఆస్తి పత్రాలు, గుర్తింపు కార్డులను తనిఖీ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. “మా దారిలో ఏ వాహనం ఆగినా, అది ఎవరో చూడటానికి అందరూ బయటకు వస్తారు,” అని ఆందోళన చెందిన ఒక నివాసి అన్నారు. అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయిస్తారేమో, బలవంతంగా స్థానభ్రంశం చేస్తారేమోనన్న భయంతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో తమ సోదరులు ఇప్పటికే చూసినటువంటి జీవనవిధానానికి తమ సమాజం మేల్కొంటోందని ముస్లిం వక్తలు అంగీకరించారు. తంగ్రా, టిల్జాలా, ఖిద్దర్‌పూర్, ఇక్బాల్‌పూర్, గార్డెన్ రీచ్, పార్క్ సర్కస్ వంటి ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాలలో కూల్చివేత డ్రైవ్‌లు జరుగుతాయనే వదంతులు వినిపిస్తుండగా, ఇతర చోట్ల అక్రమ నిర్మాణాలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ‘లవ్ జిహాద్’, చొరబాట్లు, యూసీసీ, ‘ముస్లిం సంఘ విద్రోహుల’ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అరెస్టుల గురించిన చర్చలు ఆ వర్గాన్ని ఆందోళనలో ఉంచుతున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ విమర్శకులపై పోలీసు సైబర్ సెల్‌లు కఠినచర్యలు తీసుకుంటుండగా, తీవ్రవాద మతవాద స్వరాలు శిక్ష లేదా ప్రతీకార చర్యల భయం లేకుండా ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. ఈ ద్వేష మహమ్మారి ఇప్పటికే రోజువారీ సంభాషణలను, ప్రజా చర్చలను విషపూరితం చేస్తోంది. వీధి వ్యాపారులపై నిషేధం చిన్న వ్యాపారాలను కుంగదీస్తోంది, ఇది ముస్లిం కార్మికులను అసమానంగా ప్రభావితం చేస్తోంది.
కోల్‌కతాలోని ముస్లిం-అధికంగా నివసించే వీధుల్లో వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులు, అక్కడి మసీదులలో ప్రార్థనలు చేసే ప్రజలు అందరూ ఈరోజు అంతులేని మతపరమైన రెచ్చగొట్టే చర్యలను ఎదుర్కొంటూ, బహిష్కరణ, నిర్బంధం, వెలివేత లేదా అంతకంటే దారుణమైన పరిణామాల భయంతో ఆత్మరక్షణలో కూరుకుపోయారు.
