న్యూఢిల్లీ: అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్‌కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు, సోమవారం జరిగిన సమావేశం తర్వాత ఆ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఆలయ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగుచూసిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇది. మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా లేఖను సమావేశంలో పరిశీలన కోసం ఉంచారని, దానిని ఆమోదించారని ట్రస్ట్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, ట్రస్టీ దినేంద్ర దాస్ మాత్రం అలా జరగలేదని చెప్పినట్లు సమాచారం.
సమావేశంలో ట్రస్టీల ముందు రాయ్ రాజీనామా లేఖను ఉంచలేదని, పైగా “విచారణలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా రుజువు కాలేదు” కాబట్టి మెజారిటీ సభ్యులు ఆయనను తొలగించే ఆలోచనను వ్యతిరేకించారని దినేంద్ర దాస్ పేర్కొన్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. బాబ్రీ మసీదు కేసులో అసలు వాదిగా ఉన్న ‘నిర్మోహి అఖారా’కు అధిపతి అయిన దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దానికి బదులుగా, రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరారని, వారి రాజీనామాలను ఆమోదించినట్లు ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి సభ్యులకు తెలియజేశారని దాస్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది.
బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్యమంలోనూ, సుప్రీంకోర్టు 2019 తీర్పు తర్వాత అదే స్థలంలో రామ్ మందిర నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించిన విశ్వహిందూ పరిషత్ (VHP) సీనియర్ నేత అయిన రాయ్, నిధుల దుర్వినియోగం వ్యవహారం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ‘నైతిక కారణాల’తో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.
గత నెల ఆరంభంలో ఆరోపణలు బహిర్గతమైనప్పుడు, “ఇప్పటివరకు గమనించదగ్గ విషయం ఏదీ ఎవరి దృష్టికీ రాలేదు” అని రాయ్ వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత, ఈ వ్యవహారం వార్తల్లోకి రాకముందే తనకు ఆ ఆరోపిత చోరీ గురించి తెలుసని ఆయన విచారణ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత, తనపై “అనేక నిరాధారమైన ఆరోపణలు” చేస్తున్నారని, అధికారిక పరిశీలనలో ఉన్న ఆలయ విరాళాల లెక్కింపు విధాన మార్పుపై తాను ఎప్పుడూ సంతకం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో, ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానితుడైన గోపాల్ రావు (అలియాస్ గోపాల్ నగర్కట్టె) మాట్లాడుతూ, కొంతకాలం పాటు సంస్థ సమావేశాలకు హాజరుకావద్దని మాత్రమే తనను కోరారని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితా నుండి రావు పేరును తొలగించాలని ట్రస్ట్ ఇటీవలే నిర్ణయించినప్పటికీ, బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… “కొన్ని రోజుల పాటు ట్రస్ట్ కార్యకలాపాలకు నేను హాజరుకాకూడదని అందరూ కలిసి భావించారు, దానికి నేను అంగీకరించాను, అంతేనని అన్నారు.”
“ఆలయంలో కొత్త ఏర్పాట్లు రాబోతున్నాయి, నేను సహాయం చేయాల్సి ఉంది, కనీసం 15వ తేదీ వరకు నేను ఆలయానికి వెళ్తాను. అవసరం ఉన్నంత వరకు నేను సహకరిస్తాను. కొత్త బృందం వచ్చినప్పుడు, నేను తప్పుకుంటానని కూడా ఆయన అన్నారు.”
సోమవారం జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో కోశాధికారి గిరి మాట్లాడుతూ, “మేము గోపాల్ రావు జీని ఆహ్వానిత సభ్యుడిగా పిలిచేవాళ్ళం. ఇకపై ఆయన ఆహ్వానిత సభ్యుడిగా [ట్రస్ట్‌కు] రారు. ఆ పద్ధతికి స్వస్తి పలకడం జరిగిందని చెప్పారు.
రామ్ మందిర్ విరాళాలు అపహరణకు గురయ్యాయన్న ఆరోపణలు గత నెల ప్రారంభంలో వెలుగులోకి వచ్చాయి; ఆ తర్వాత సుమారు వారం రోజులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సుమారు రెండు వారాలకు, అంటే జూన్ 26న, అంతకు ముందు రోజు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ఆధారంగా పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన మధ్యంతర నివేదికలో, ఆలయంలో విరాళాల లెక్కింపులో అనేక విధానపరమైన లోపాలు ఉన్నాయని SIT పేర్కొంది.
