Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఆర్‌ఎస్‌ఎస్ వివాదం…ప్రభుత్వ ఆస్తుల వినియోగంపై కొత్త బిల్లును తీసుకొస్తున్న కర్ణాటక!

Share It:

బెంగళూరు: ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కార్యకలాపాలను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లును తీసుకువస్తోంది. బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలలు నిర్వహించడంపై రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గేకు, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నారు.

ఈమేరకు ‘ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రభుత్వ ఆస్తుల వినియోగ కర్ణాటక నియంత్రణ బిల్లు, 2026’పై రాష్ట్ర మంత్రివర్గం చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం…ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి నమోదుకాని సంస్థలతో సహా ఏ సంస్థ అయినా ప్రభుత్వ స్థలంలో ఏదైనా కార్యక్రమం నిర్వహించే ముందు సంబంధిత అధికారి నుండి అనుమతి పొందవలసి ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ మైదానాలు, ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రదేశాలలో నిర్వహించే శాఖలతో సహా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై ఈ చర్య ప్రభావం చూపే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఆర్‌ఎస్‌ఎస్ వంటి సమూహాలు అటువంటి ప్రాంగణాలను ఉపయోగించే ముందు అధికారిక అనుమతి తీసుకోవలసి ఉంటుందని వారు చెప్పారు.

ప్రభుత్వ సంస్థలు, బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని మంత్రి కోరడంతో గతేడాది ఖర్గే, ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య మొదలైన వివాదం నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన లేఖలో, ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక పాఠశాలలు, బహిరంగ మైదానాల్లో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు నిర్వహిస్తోందని, అక్కడ “నినాదాలు చేస్తూ, పిల్లలు, యువత మనసుల్లో ప్రతికూల భావాలను నూరిపోస్తున్నారని” ఖర్గే ఆరోపించారు.

మంత్రి ఖర్గే ప్రకారం… ఇటువంటి కార్యకలాపాలు “భారతదేశ ఐక్యతకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం”. ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ మైదానాలు, పార్కులు, దేవాలయాలు, పురావస్తు ప్రదేశాలు, ఇతర ప్రభుత్వ భూముల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఆయన కోరారు. అనంతరం సిద్దరామయ్య చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించగా, ప్రభుత్వ ఆస్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అప్పటి నుంచి ఈ అంశం ఒక పెద్ద రాజకీయ ఘర్షణగా పరిణమించింది. ఈ ఏడాది జూన్‌లో, ప్రస్తుతం రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న ఖర్గే, ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్‌కు లేఖ రాస్తూ, ఆ సంస్థ చట్టపరమైన హోదా, రిజిస్ట్రేషన్, కార్యనిర్వాహకులు, నిధులు, ఖర్చు, పన్నుల చెల్లింపునకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని కోరారు.

ఆర్‌ఎస్‌ఎస్ వంటి భారీ స్థాయి, విస్తృతమైన ప్రజా ప్రాబల్యం ఉన్న సంస్థ కూడా, ఇతర సంస్థలకు వర్తించే పారదర్శకత, జవాబుదారీతనం నిబంధనలకు లోబడి ఉండాలని ఖర్గే పేర్కొన్నారు. అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు నిర్వహించడానికి గల చట్టపరమైన ఆధారాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

భగవత్ ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తూ, ఇది రాజకీయ ప్రేరేపితమని, ఖర్గే ప్రశ్నలలో తీవ్రమైన విషయం ఏమీ లేదని పేర్కొన్నారు. తాము బహిరంగంగానే పనిచేస్తామని, మంత్రి సూచించిన విధంగా తమకు అధికారిక రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది.

కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల స్థాయిని, దాని బహిరంగ కార్యక్రమాలు, ప్రదర్శనల సమయంలో భద్రత కల్పించాల్సిన రాష్ట్ర బాధ్యతను కూడా ఖర్గే తన డిమాండ్‌కు ముడిపెట్టారు. హోం మంత్రిగా, ఆ సంస్థ గురించి, దాని బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనే వారి గురించి తనకు స్పష్టత అవసరమని ఆయన తెలిపారు.

అందువల్ల, అధికారికంగా నమోదు కాని సంస్థల కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించవచ్చా లేదా అనే విషయంపై, అటువంటి నిబంధనలను నిష్పక్షపాతంగా రూపొందిస్తున్నారా లేక ప్రధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను నియంత్రించడానికేనా అనే విషయంపై ఉన్న రాజకీయ వివాదాన్ని ఈ తాజా ప్రతిపాదన మళ్లీ రాజేసే అవకాశం ఉంది.

బీజేపీ ఈ చర్యను వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో, బీజేపీకి సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఈ అంశం మరో ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.