వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వివాదం నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని మరింత తీవ్రం చేసింది. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను దెబ్బతీసేలా కఠినమైన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనాన్ని నిరంతరం కొనసాగిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈమేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ… వచ్చే వారం కొత్త చర్యలు ఆశించవచ్చని కూడా ఆయన తెలిపారు.
“ఇది ప్రపంచం మునుపెన్నడూ చూడని విధంగా ఆర్థిక దిగ్బంధనం” అని బెసెంట్ కన్జర్వేటివ్ టెలివిజన్ నెట్‌వర్క్ న్యూస్‌మాక్స్‌తో అన్నారు. “హర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధనం… ఇరాన్ ఓడరేవుల నుండి లోపలికి లేదా బయటకు ఏదీ వెళ్లకుండా నిరోధిస్తుంది,” అని ఆయన తెలిపారు. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై అవసరమైతే దాడులు జరపడం అన్నమాట. కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై నౌకా దిగ్బంధంతో పాటు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్ ను చర్చలకు తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా…హర్మూజ్ జలసంధిలో ఒమన్ వద్ద ఓ నౌకపై అమెరికా దాడి చేసింది. ఇరాన్ రేవులపై తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. పనామా జెండా కలిగిన ‘వేలా నోవా’ కార్గో నౌకపై నేవీ హెలికాప్టర్ రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడిలో సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అనే విషయాన్ని తెలుపలేదు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పనామా కాల్వలో నౌకల రద్దీ పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.


