Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

భారత్‌లో కిడ్నీ వైద్యులు, టెక్నీషియన్లకు తీవ్ర కొరత… పార్లమెంటరీ స్థాయి సంఘం!

Share It:

రేవా: భారతదేశంలో మూత్రపిండ వ్యాధుల నిర్వహణలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారింది. దేశంలోని కనీసం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏ జిల్లా ఆసుపత్రిలోనూ ఒక్క నెఫ్రాలజిస్ట్ కూడా లేరు. అలాగే, 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా ఆసుపత్రులలో ఒక్క డయాలసిస్ టెక్నీషియన్ కూడా లేరని ఈ నెలలో విడుదలైన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక వెల్లడించింది.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రాష్ట్రాల్లో చాలా వరకు తమ జిల్లా ఆసుపత్రులలో మూత్రపిండ వ్యాధుల నిర్వహణ కోసం సిబ్బంది పోస్టులను మంజూరు కూడా చేయలేదు – ఇక వారిని నియమించడం అనే మాట దేవుడెరుగు.

జిల్లా ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. వాటి నిర్వహణ, సిబ్బందికి సంబంధించిన నిధులను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన వాటిని కేంద్ర ప్రభుత్వం భరిస్తాయి. అవసరమైన సిబ్బంది లేకపోవడం అనేది జిల్లా, అంతకంటే దిగువ స్థాయిలలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల (CKD) చికిత్స తీవ్రంగా దెబ్బతింటోందనడానికి సంకేతం.

రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వైద్య కళాశాలల్లో సాధారణంగా ఈ నిపుణులు ఉన్నప్పటికీ, అక్కడ కూడా రోగుల రద్దీ ఎక్కువగా ఉండటం, పనిభారానికి తగినంత సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.

నెఫ్రాలజిస్టులు CKD చికిత్సలో ప్రత్యేకత కలిగి ఉంటారు. వారు సాధారణంగా శస్త్రచికిత్సలు చేయరు. మూత్రపిండాలకు సంబంధించిన వివిధ సమస్యలకు యూరాలజిస్టులు శస్త్రచికిత్స చేస్తారు. మరొక ముఖ్యమైన విభాగాలలోనూ టక్నీషియన్ల కొరత ఉంది. 29 రాష్ట్రాల్లోని ఏ జిల్లాలోనూ నెఫ్రాలజిస్టులు లేనప్పటికీ, మేఘాలయ, గుజరాత్, పుదుచ్చేరిలోని జిల్లా ఆసుపత్రులలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

29 రాష్ట్రాల్లోని ఏ జిల్లా ఆసుపత్రిలోనూ యూరాలజిస్ట్ లేరు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 31 మంది యూరాలజిస్టులు ఉన్నారు. CKD నిర్వహణలో డయాలసిస్ అనేది కీలకమైన ప్రక్రియలలో ఒకటి. దీనికి కూడా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ నిపుణుల తీవ్ర కొరత ఉంది. ఇరవై రాష్ట్రాల్లోని ఏ జిల్లా ఆసుపత్రిలోనూ డయాలసిస్ టెక్నీషియన్లు లేరు.

ఈ పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. అందువల్ల, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడానికి ఒక కాలపరిమితితో కూడిన ప్రక్రియను చేపట్టాలని కమిటీ సిఫార్సు చేస్తోంది.

భారతదేశంలోని వయోజన జనాభాలో సుమారు 13–16% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నవీకరించే డేటాబేస్ ఏదీ లేదని కమిటీ చెబుతోంది.

“వ్యాధి సంభవించడం, దాని పురోగతి, చికిత్సా విధానాలు, వైద్యపరమైన ఫలితాలు, మరణాల రేటు” వంటి రోగి-స్థాయి సమాచారాన్ని సేకరించకుండానే ఈ విషయంలో విధాన రూపకల్పన అంతా జరుగుతోంది. అందువల్ల, జాతీయ కిడ్నీ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేసింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.