హైదరాబాద్: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
పోచంపల్లి మండలంలోని యూనిట్‌లో కార్మికులు షిఫ్టులు మారుస్తుండగా శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి.
“ఇద్దరు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు, వీరిలో ఇద్దరికి 50 శాతానికి పైగా కాలిన గాయాలవ్వగా, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి” అని ఒక పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు.
గాయపడిన వారిని వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్చినట్లు ఆ అధికారి చెప్పారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది అనంతరం మంటలను ఆర్పివేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో గ్రామస్థులు భయంతో ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి పరిశ్రమ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. పరిశ్రమ యాజమాన్యం ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో పదిమందికి పైగా ఉన్నారని పరిశ్రమలో పనిచేసే ఇతర కార్మికులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇదే పరిశ్రమలో మూడు నెలల్లోనే ఇది రెండో ప్రమాదం కావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


