ముహమ్మద్ ముజాహిద్….✍️
అమెరికాలో ప్రచురితమైన ఆ ప్రసిద్ధ పుస్తకం “ది 100” (The 100) పుటలు తిప్పుతుంటే, మానవ చరిత్రను మలచిన ఆ వంద మంది ప్రముఖుల జాబితా మన కళ్ల ముందు కదలాడుతుంది. ఆ పుస్తక రచయిత వృత్తిరీత్యా శాస్త్రవేత్త, మతరీత్యా క్రైస్తవుడు. కానీ, ఆయన తన జాబితాలో ఎవరికి ప్రథమ తాంబూలం ఇచ్చాడో తెలుసా? ఏ యేసు క్రీస్తుకూ కాదు, ఏ న్యూటన్‌కూ కాదు! మానవజాతి చరిత్రపై చెరగని ముద్ర వేసిన ఆ అగ్రగామి వ్యక్తి ఎవరో కాదు, మన ఇస్లాం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వసల్లమ్).
ఒక క్రైస్తవ శాస్త్రవేత్త స్వయంగా వ్రాస్తూ – “చరిత్రలో మతపరమైన, లౌకికమైన… ఈ రెండు రంగాలలోనూ సంపూర్ణంగా విజయవంతమైన ఏకైక వ్యక్తి ఆయనే” అంటారు. థామస్ కార్లైల్ నుంచి మైఖేల్ హార్ట్ వరకు ఎందరో మహానుభావులు ప్రవక్త గారి మహోన్నత వ్యక్తిత్వాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఇది కేవలం ముస్లింల నమ్మకం మాత్రమే కాదు, చరిత్ర ఎరిగిన అక్షర సత్యం!
ఆకాశం నలువైపులా ఎలా వ్యాపించి ఉందో, మానవ జీవితంలో ఏ కోణం నుంచి చూసినా ప్రవక్త గారి ప్రభావం అలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈనాడు మనం గౌరవించే ప్రతి గొప్ప విలువ, ప్రతి ఉన్నత ఆదర్శం… ఆయన తెచ్చిన ఆ మహోన్నత పరివర్తన తాలూకు ప్రత్యక్ష లేక పరోక్ష ఫలితమే!
- వ్యక్తి ఆరాధనకు బదులుగా కేవలం ఏకైక అల్లాహ్ ఆరాధనను ఎవరు నేర్పారు?
- మూఢనమ్మకాల పొరలను చీల్చి, సత్యం మరియు విజ్ఞానపు పునాదులపై విశ్వాసాన్ని నిలబెట్టింది ఎవరు?
- విజ్ఞాన శాస్త్రంలో కేవలం ప్రకృతి పూజను ఆపి, ప్రకృతిని శాసించే విజ్ఞతను బోధించింది ఎవరు?
- రాజకీయంలో వంశపారంపర్య రాచరికపు జాడ్యాలను తొలగించి, ప్రజాస్వామ్యపు బాటలు చూపింది ఎవరు?
వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం – మన ప్రవక్త ముహమ్మద్ (సల్ల.)!
అల్లాహ్ తన ప్రవక్తను చరిత్రకు ఒక మహా మినార్‌గా నిలబెట్టాడు. మానవుడు ఏ దిక్కున చూసినా ఆ దీపస్తంభం కాంతులు కనిపిస్తాయి. సత్య మార్గం కోసం పరితపించే ఏ గుండెకైనా ఆ మహోన్నత వ్యక్తిత్వమే మొదట ఆకర్షిస్తుంది.
నాయకుల నర్సరీ (ఆదర్శాల పుట్టినిల్లు) - మహా చైతన్యం: ప్రవక్త గారి జీవితం కేవలం గడిచిపోయిన కాలం కాదు, భావితరాలకు అక్షయ పాత్ర లాంటి జీవన వేదం.
- సహనం, క్షమాగుణం: ఎన్నో కష్టాలు, రాళ్ళు రువ్విన తాయిఫ్ వీధులు, ప్రాణాల మీదకు తెచ్చిన శత్రువులు… వీటన్నింటి మధ్య కూడా వారు చూపిన క్షమాగుణం మానవాళికి ఒక అద్భుత పాఠం.
- శాంతియుత మార్గం: కోపతాపాలకు పోకుండా, విద్వేషాలను ప్రేమతో గెలుచుకుంటూ వారు సాధించిన విజయం చారిత్రకం.
“నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ ప్రవక్తలో అత్యుత్తమమైన ఆదర్శం ఉంది…” (ఖుర్ఆన్, 33:21)
మరి నేడు… ఈ ఉరుకుల పరుగుల ఆధునిక ప్రపంచంలో, ప్రవక్త గారు చూపిన ఆ శాంతి మార్గాన్ని, ఆ సహన గుణాన్ని మనం మన జీవితంలో ఎంతవరకు పాటిస్తున్నాం? ఒకసారి గుండెమీద చెయ్యేసుకుని ఆలోచించవలసిన విషయమే కదా!


