Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

లవ్ జిహాద్… మనుషుల అపోహలు, మతం చెప్పిన నైతికతలు!

Share It:

ముహమ్మద్ ముజాహిద్ …✍️

జీవితం ఎంత విచిత్రమైనది? హృదయాలను కలపాల్సిన ‘ప్రేమ’ అనే పదాన్ని, యుద్ధంతో ముడిపెట్టి ‘లవ్ జిహాద్’ అని పిలుస్తుంటే సమాజం ఎంత సంకుచితంగా మారిపోయిందో అనిపిస్తుంది. ప్రేమని శాసించగల చట్టాలు, ప్రేమకి మతం రంగు పులిమే విమర్శలు… అసలు వీటన్నింటి వెనుక ఉన్న సత్యమేమిటి?మనస్సులు కలిసే చోట మతం వెతుక్కునే అజ్ఞానం నాకొద్దు. కానీ, ఒక మతాన్ని వేలెత్తి చూపే ముందు ఆ మతం అసలు ఏం చెబుతోందో తెలుసుకునే సంస్కారం మనకు ఉండాలి కదా?

ఇస్లాం ప్రేమను కాదనలేదు, కానీ దానికి నైతికత అనే ఒక అందమైన గీత గీసింది. పెళ్లికి ముందు దొంగచూపులు, ఆకర్షణలు, కామపు వెర్రితలలు… వీటిని ఇస్లాం ఎన్నడూ ఒప్పుకోలేదు. జిహాద్ అంటే కత్తులు నరకడం కాదు, నీ లోపల రగిలే కామాన్ని, స్వార్థాన్ని, చెడు కోరికలను జయించడం. ఆత్మను పవిత్రం చేసుకోవడమే అసలైన జిహాద్.

ఇక పెళ్లి విషయానికి వస్తే— ఒక ముస్లిం పురుషుడు ఎలాంటి స్త్రీని ఎంచుకోవాలని ప్రవక్త చెప్పారు? ధనం ఉన్నదాన్నో, రూపసి నో కాదు; భక్తి, నైతికత, మంచితనం ఉన్న స్త్రీని ఎంచుకోమన్నారు. రేపు రాబోయే తరానికి సన్మార్గాన్ని చూపించే పవిత్రత ఆమెలో ఉందో లేదో చూడమన్నారు. తన మతాన్ని, ధర్మాన్ని నిష్టగా పాటించే స్త్రీకే ప్రాధాన్యం ఇవ్వమని చెప్పిన మతం, వేరే మతాల స్త్రీలను మోసం చేసి, ప్రేమ పేరిట వల వేసి పెళ్లి చేసుకోమని చెబుతుందని అనుకోవడం ఎంతటి అమాయకత్వం? ఎంతటి మూర్ఖత్వం?ఇక్కడ దాగిన నిజం ఒక్కటే. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో ఇద్దరు మనుషులు కలిస్తే అది వారి వ్యక్తిగత విషయం. కానీ దానికి ‘జిహాద్’ అని పేరు పెట్టి, ఒక మతం మొత్తానికి కుట్రను ఆపాదించడం కేవలం ద్వేషాన్ని పెంచడానికే.

ఖురాన్ చాలా అందంగా చెబుతుంది: “నీకు నచ్చినది నీకు హాని చేయవచ్చు, నీకు నచ్చనిది నీకు మేలు చేయవచ్చు.”ప్రేమ అనేది హృదయానికి సంబంధించిన పవిత్ర భావన. దానికి కుట్రలని, కుతంత్రాలని రంగులు పూసి, మనుషుల మధ్య గోడలు కట్టకండి. పవిత్రమైన బంధాన్ని రాజకీయ ఆయుధంగా మార్చకండి!

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.