Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

భాగవత్ తీపి మాటలు…!

Share It:

ముహమ్మద్ ముజాహిద్…✍️

మెరికా నింగి కింద నిలబడి, న్యూయార్క్ వెలుగుల్లో మెరిసిపోతూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఒక విచిత్రమైన సూక్తి చెప్పారు— “సచ్ఛా హిందూత్వ ముస్లింలను వెలివేయదు. ముస్లింలకు ఈ దేశంలో చోటు లేదనుకునేవాడు అసలు హిందువే కాడు!” అని. వినడానికి ఎంత ఇంపుగా ఉందో ఈ మాట! విదేశీ వేదికల మీద, ఆంగ్ల విద్యార్థుల ముందు, కెమెరా వెలుగుల్లో ఈ ‘మానవత్వం’ ముసుగు ఎంత ముచ్చటగా ఉందో!

కానీ, నన్ను అడగనివ్వండి… ఈ మాటలు నిజంగా గుండెల్లోంచి వచ్చినవేనా? లేక ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి తొడుక్కున్న ‘దౌత్యపు’ ముసుగా?

మాటల వెనుక దాగిన భయం:
న్యూయార్క్ వీధుల్లో ఎదురైన నిరసనలు, అక్కడి స్థానిక నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకత చూసి తట్టుకోలేకపోయిన భయమే ఈ ‘ముస్లిం ప్రేమ’ ప్రసంగానికి కారణం కాదా? గతంలో ఎల్.కె. అడ్వాణీ కూడా పాకిస్తాన్ వెళ్లి ముహమ్మద్ ఆలీ జిన్నా సమాధి ముందు నిలబడి ఆకాశానికెత్తి మురిసిపోయారు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదా? తిరిగి వచ్చి అదే అడ్వాణీ రథయాత్రల పేరిట రక్తం చిందించలేదా? భాగవత్ గారి ఈ నాటకం కూడా ఆ పాత కాగితాల్లోని భాగమే!

సిద్ధాంతం వేరు… వీధి రౌడీయిజం వేరు:
కవైపు భాగవత్ గారు అంతర్జాతీయ వేదికలపై నిలబడి “మనుషులంతా ఒకటే, మార్గాలు వేరైనా చేరే దేవుడు ఒక్కడే” అని ఉపనిషత్తులు వల్లె వేస్తుంటారు. కానీ, ఆయన కంటిసైగతో నడిచే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వీధుల్లో ఏం చేస్తున్నాయి?

వ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’, ‘థూక్ జిహాద్’ అంటూ అబద్ధాల వేటలు ఆడటం లేదా?

న్వర్ యాత్రల దారుల్లో ముస్లిం వ్యాపారులు తమ బోర్డులు తొలగించుకోవాలని, పేర్లు బయటపెట్టుకోవాలని వారి పొట్ట కొట్టడం లేదా?

ముస్లింల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ, వారిని సాంఘికంగా వెలివేయాలనే కుట్రలు వీధి వీధినా సాగడం లేదా? ఇదా భాగవత్ గారు చెప్తున్న ‘సచ్ఛా హిందూత్వ’?

చట్టం పేరిట సాగుతున్న హింస:
కేవలం వీధి రౌడీలే కాదు, నాగపూర్ ఇచ్చే ఆదేశాలతో నడిచే ప్రభుత్వాలు చట్టాల పేరిట చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. CAA, NRC లతో మైనారిటీల గుండెల్లో నిరంతరం భయాన్ని నూరిపోయడం, మతమార్పిడి నిరోధక చట్టాల పేరిట పౌర హక్కులను కాలరాయడం, ఏకరూప సివిల్ కోడ్ ముసుగులో స్వేచ్ఛను ఆరబెట్టడం… ఇవన్నీ ఏ భావజాలం నుంచి పుట్టుకొచ్చాయి? ఏలుతున్న నాయకులు ఎన్నికల సభల్లో విషం చిమ్ముతుంటే, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి ఒక్క కంట్రోల్ ప్రకటనైనా వచ్చిందా?

చరిత్ర పుటల తిరగరాత – విషపు వేర్లు
సంఘ్ మూల పురుషుడు ఎం.ఎస్. గోల్వాల్కర్ తన “We or Our Nationhood Defined” పుస్తకంలో స్పష్టంగా రాశారు— “ఈ దేశంలో హిందూయేతరులు హిందూ సంస్కృతిని, భాషను తమదిగా స్వీకరించాలి; లేదంటే ఎలాంటి హక్కులూ లేని ద్వితీయ శ్రేణి పౌరులుగా పడి ఉండాలి” అని. భాగవత్ గారు “గోల్వాల్కర్ ఆలోచనలు మారాయి” అని ఎన్ని పటాలు కట్టినా, వారి లక్షలాది మంది స్వయంసేవకుల రక్తం లోతుల్లో ప్రవహిస్తున్నది ఆ పాత విషమే! అందుకే ఈ రోజు చరిత్రను తిరగరాస్తున్నారు, పట్టణాల పేర్లు మారుస్తున్నారు, పాఠ్యపుస్తకాల నుంచి మనుషుల ఉనికిని తుడిచేస్తున్నారు.

మౌనమే సమ్మతి… బుల్డోజర్ల సంస్కృతి
వు పేరు చెప్పి వీధుల్లో మనుషులను కొట్టి చంపుతుంటే, ముస్లింల ఇళ్లపైకి బుల్డోజర్లు ఎక్కిస్తుంటే, ధర్మసంసద్‌లలో బహిరంగంగా పౌరుల నిర్మూలనకు పిలుపునిస్తుంటే భాగవత్ గారి నోటి ముత్యాలు ఎటు పోయాయి? ఈ దాడులను ఖండించని ఆయన మౌనం, ఆ మూకలకు వెన్నుదన్నుగా నిలిచే రాజకీయం కాదా?

నిలదీసే నిజం
ఈ దేశ రాజ్యాంగం ప్రతీ పౌరుడికి స్వేచ్ఛను, సమానత్వాన్ని ఇచ్చింది. ఆ స్వేచ్ఛను కాపాడటానికి విదేశాల్లో ప్రసంగాలు అక్కర్లేదు; సొంత దేశంలో ఆచరణ కావాలి. భాగవత్ గారూ! మీ ‘నోటి మాటలకు’ మీ అనుబంధ సంస్థల ‘చేతలకు’ పొంతన లేనంత కాలం… మీరు న్యూయార్క్‌లో చెప్పినా, ఢిల్లీలో చెప్పినా ఈ మాటలు కేవలం “అసత్యపు అక్షరాలు”, “వ్యూహాత్మక నాటకాలు” మాత్రమే!

మీరు నిజంగా మానవత్వాన్ని నమ్మితే, ముందు మీ శ్రేణుల చేతుల్లో ఉన్న ద్వేషపు ఆయుధాలను దించండి. మాటలను కాదు… చేతలను మార్చి చూపించండి!

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.