ముహమ్మద్ ముజాహిద్…✍️
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా, మన దేశంలో మనుషులు మనుషులుగా బతికే హక్కును కాలరాస్తూ రోడ్ల మీద, రైళ్లలో గుంపులుగా మూగ జీవుల మాదిరిగా దాడులకు తెగబడుతున్న వైనం మన ప్రగతిశీల తళుకుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బట్టబయలు చేస్తోంది. ఇటీవల వెలువడిన 744 పేజీల సమగ్ర పరిశోధనాత్మక నివేదిక (Mob Lynching in India — A Record — 2014-2024) దేశ వికాసానికి అడ్డుపడుతున్న ఒక భయానక సామాజిక రుగ్మతను కళ్లకు కట్టినట్టు చూపించింది.
గతంలో మన దేశం చూసిన రాజకీయ అల్లర్లు, మత ఘర్షణలు ఒక పద్ధతి ప్రకారం ఉండి శాంతించేవి. కానీ, నేడు ఈ “మాబ్ లించింగ్” (మూక దాడులు) అనేది ఒక వ్యవస్థీకృత నేరంగా, ప్రతిరోజూ జరిగే సామాన్య ప్రక్రియగా మారిపోవడం అత్యంత గర్హనీయం, ఆందోళనకరం.
రాజకీయ పోషణ – పోలీసుల నిష్క్రియ
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఈ మూకలకు ఎక్కడి నుంచి వస్తోంది ఈ బలం? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండవలసిన వారే నిందితులను పూలమాలలతో సత్కరించి, వారికి నాయకులమన్న భ్రమ కల్పిస్తుంటే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది? గోరక్షణ ముసుగులో సాగుతున్న ఈ అరాచకాలు కేవలం నేరాలు మాత్రమే కావు, ఇవి మన రాజ్యాంగ వ్యవస్థ మీద, లౌకిక వాదం మీద జరుగుతున్న ముప్పేట దాడులు.
సాంకేతికతను ఆయుధంగా మలచుకుని, తాము చేసిన పైశాచిక దాడులను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో గర్వంగా పంచుకుంటున్నారంటే, చట్టం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల వీరికి ఎంతటి నిర్లక్ష్య భావమో ఇట్టే అర్థమవుతోంది. నేరస్థులకు కొద్ది రోజుల్లోనే బెయిళ్లు లభించడం, సమాజంలో హీరోలుగా స్వాగతాలు అందుకోవడం మన నేరన్యాయ వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది.
భారతీయతకు పెను ముప్పు
ముస్లింలు, క్రైస్తవులు, దళితులు వంటి అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ హింసాత్మక సంస్కృతి రేపు ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఇది రేపు దేశ సర్వనాశనానికి దారితీసే పెను ముప్పు. చారిత్రక స్పృహ లేని సమాజం గొర్రెల మందలా తయారవుతుందనడానికి ఈ పరిణామాలు ప్రత్యక్ష నిదర్శనం. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. కేవలం పైపూత చర్యలతో సరిపెట్టకుండా, ఈ దేశంలో ప్రతి పౌరుడు నిర్భయంగా బతికే వాతావరణాన్ని కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకమైన, కఠినమైన యాంటీ-లించింగ్ చట్టాన్ని తక్షణమే తెచ్చి అమలు చేయాలి. అప్పుడే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు నిజమైన అర్థం చేకూరుతుంది. లేదంటే, చరిత్ర మనల్ని క్షమించదు!
