సయ్యద్ సాదతుల్లా హుసైనీ, ప్రెసిడెంట్, JIH…✍️
దేశంలో నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ నిబంధనలకు విఘాతం కలిగిస్తూ సాగుతున్న పరిణామాలు ఆందోళనకర మలుపు తిరిగాయి. మైనారిటీ వర్గాలను, ప్రత్యేకించి ముస్లింలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న వరుస ఘటనలు, మసీదులపై జరుగుతున్న దాడులు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు; ఇవి ఒక పథకం ప్రకారం సాగుతున్న ప్రమాదకరమైన ధోరణికి నిదర్శనం. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని వివిధ రాష్ట్రాల్లో నిరంతరం పునరావృతమవుతున్న ఈ ఘటనలు సార్వభౌమత్వానికే సవాలుగా మారుతున్నాయి.
ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ఆ ఆదేశాలను బహాటంగా ధిక్కరిస్తూ ‘బుల్డోజర్ న్యాయం’ పేరిట సాగుతున్న అన్యాయం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తోంది. చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెట్టి, పేదల, నిరపరాధుల ఇళ్లను నేలమట్టం చేసే ధోరణి సమాజంలో అరాచకత్వానికి బాటలు వేస్తోంది.ఓటర్ల జాబితా సవరణ నెపంతో ప్రతిపక్షాల, ప్రత్యేకించి మైనారిటీల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారనే ఆరోపణలు ప్రజాస్వామ్య పునాదులనే కదిలిస్తున్నాయి. జనాభా నిష్పత్తికి భిన్నంగా, నిర్దిష్ట వర్గాల ఓట్లను ఏకపక్షంగా రద్దు చేయడం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది.
ఇది కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దేశంలో చట్టపాలన నశించి, రాజ్యాంగ విలువలు మంటగలిస్తే—దాని దుష్పరిణామాలను ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు అనుభవించక తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బగా పరిణమిస్తుంది.ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యం లోనే నేడు దేశం నలుమూలల నుండి సమరశంఖం పూరించేందుకు ప్రజలు ఏకమయ్యారు. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించిన పోరాటం కాదు. రాజ్యాంగ బద్ధతను కాపాడుకునేందుకు హిందూ, ముస్లిం, సిక్కు సోదరులందరూ కలసికట్టుగా నిలబడిన ఐక్య పోరాటం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, పక్షపాత ధోరణిని వీడాలి. రాజ్యాంగానికి బద్ధులై, నిష్పాక్షికంగా పాలన సాగించకపోతే ప్రజాక్షేత్రంలో గట్టి ప్రతిఘటన తప్పదని సమకాలీన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
