హైదరాబాద్: పట్టణాభివృద్ధి దిశగా ఒక కీలక ముందడుగు వేస్తూ, నీటి సరఫరా, వర్షపునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, బ్లూ-గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుస్థిర రవాణా వంటి పురపాలక పౌర సౌకర్యాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం జర్మనీ నుంచి రూ. 5,000 కోట్ల రుణ సహాయాన్ని పొందింది. తెలంగాణ CRUTI (క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ట్రాన్స్ఫార్మేషన్ ఇనిషియేటివ్) కింద సహాయం కోరేందుకు రాష్ట్రం చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనిలోని ప్రధాన భాగం గ్రేటర్ వరంగల్ సమగ్ర మురుగునీటి, వ్యర్థజలాల నిర్వహణ పరివర్తన ప్రాజెక్ట్. దీనికి సుమారు రూ. 5,257 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు.
ఈ కార్యక్రమం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర మురుగునీటి నెట్వర్క్లను ఏర్పాటు చేయడం, గృహ కనెక్షన్లను విస్తరించడం, వ్యర్థజలాల శుద్ధిని మెరుగుపరచడం, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా, తెలంగాణ CRUTI వినూత్న ఫైనాన్సింగ్, సంస్థాగత బలోపేతం, మరియు అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కేంద్ర పథకాలతో అనుసంధానాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ పట్టణ అభివృద్ధి కార్యక్రమం మొత్తం అంచనా వ్యయం రూ. 7,143 కోట్లు. ఇందులో జర్మన్ బ్యాంక్ రుణం రూ. 5,000 కోట్లు కాగా, మిగిలిన రూ. 2,143 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా భరిస్తుంది.
ఎంపిక చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 24 గంటల తాగునీటి సరఫరా, వరద నీటి నిర్వహణ (Stormwater Management), చెరువుల పునరుజ్జీవనం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్థిరమైన పట్టణ రవాణా (Sustainable Mobility) వ్యవస్థల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తారు.
కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్ల మద్దతుతో డీఈఏ (DEA) స్క్రీనింగ్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా డీపీఆర్లు (Detailed Project Reports) సమర్పించిన అనంతరం జర్మన్ బ్యాంకుతో తుది రుణ ఒప్పందం జరగనుంది.
