న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జంతర్ మంతర్‌ను నిరసనల జాబితా నుండి తొలగించి, మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ప్రకటించారు. వాటిలో ప్రధానమైనది రామ్‌లీలా మైదాన్. సుమారు 50,000 మందికి వసతి కల్పించగల 12 ఎకరాల ఈ మైదానాన్ని బుక్ చేసుకోవడానికి, సెక్యూరిటీ డిపాజిట్, పన్నులతో సహా ఒక రోజుకు రూ. 1.21 లక్షల ఖర్చు అవసరమని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ ద్వారా ఈ మైదానాన్ని బుక్ చేసుకోవచ్చు, ఆ శాఖే దీని వినియోగానికి అనుమతి ఇస్తుంది. మున్సిపల్ సంస్థ ఒక దరఖాస్తును ఆమోదించే ముందు ఢిల్లీ పోలీసుల నుండి నిరభ్యంతర పత్రం తప్పనిసరి.
ఈమేరకు అక్టోబర్ 11న పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ఉత్తర్వు జారీ చేసారు. కాగా, నిరసన తెలిపేందుకు నిర్ణయించిన మూడు మైదానాల్లో రామ్‌లీలా మైదాన్, ఉత్తర ఢిల్లీలోని బురారీ గ్రౌండ్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను కొత్త వేదికలుగా నిర్దేశించారు. ఈ మూడు ప్రదేశాలలో నిరసనల కోసం సవరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (standard operating procedure) విడిగా జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా జంతర్ మంతర్‌తో పోలిస్తే, ఈ బుకింగ్ ఛార్జీలు ప్రదర్శనలు నిర్వహించాలని యోచిస్తున్న సంస్థలకు, స్థానిక సమూహాలకు ఈ వేదికను ఖరీదైనదిగా మార్చగలవని నిరసనకారులు అన్నారు. జంతర్ మంతర్‌లో ఇలాంటి చెల్లింపు అవసరం లేదు. “ఎటువంటి రుసుము లేకుండా నిరసన కోసం మైదానాన్ని కేటాయిస్తే, మున్సిపాలిటీకి రోజుకు కనీసం రూ. 50,000 పైగా నష్టపోతుందని ఒక అధికారి అన్నారు.
నిరసన వేదిక లభ్యతను ప్రశ్నించిన ఆప్
మైదానంలో ఇప్పటికే బుకింగ్‌లు ఉన్నాయని ఎత్తి చూపుతూ, రామ్‌లీలా మైదాన్‌ను నిరసన స్థలంగా కేటాయించాలన్న నిర్ణయాన్ని ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. “ప్రభుత్వం ప్రజలకు మరో మోసం చేసింది. రామ్‌లీలా మైదాన్‌లో ఇప్పటికే రెండు రామ్‌లీలలు జరుగుతున్నాయని ఆయన Xలో పేర్కొన్నారు. “ఇక్కడ నిరసన ఎలా చేయగలరు? వారు గందరగోళం సృష్టించాలనుకుంటున్నారా?” అని ఆయన ప్రశ్నించారు.
రాబోయే వారాల్లో దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు ఉన్నందున, ఆ మైదానం ఇప్పటికే వివిధ కార్యక్రమాలు, ఉత్సవాల కోసం బుక్ చేసారని పౌరసంఘ అధికారులు తెలిపారు.
రామ్‌లీలా మైదాన్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు
కాగా, ఈ మైదానం దగ్గరలో మూడు ఆసుపత్రులు, సమీపంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ప్రధాన కార్యాలయం, రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో ఉందని అధికారులు ట్రాఫిక్ సమస్యలను కూడా ప్రస్తావించారు.
ఈ వేదిక వద్ద జరిగే భారీ జనసమూహాలు తరచుగా చుట్టుపక్కల రోడ్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రధాన కార్యక్రమాల సమయంలో పోలీసులు సాధారణంగా రెండు వైపులా రాకపోకలు సాగించే ఆసఫ్ అలీ రోడ్డును ఒక వైపు మాత్రమే రాకపోకలు సాగించే మార్గంగా మార్చి, దేశబంధు గుప్తా రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సమాంతరంగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌కు మళ్లిస్తారు.ఈ రెండు రోడ్లు ఇప్పటికే రద్దీగా ఉన్నాయని, ఆక్రమణలతో ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు.
కాగా, ఢిల్లీలోని కొత్త నిరసన వేదికలలో ఒకటిగా గుర్తించినప్పటికీ, రామ్‌లీలా మైదాన్‌లో ఈ సంవత్సరాంతం వరకు బుకింగ్ కోసం ప్రస్తుతం కేవలం మూడు తేదీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా నిరసనలు తెలపడానికి ఇంత భారీగా ఖర్చు పెట్టాల్సి రావడం, తేదీలు దొరకకపోవడంపై పలు రాజకీయ, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
