న్యూఢిల్లీ: తాజాగా విడుదలైన 2026 ప్రపంచ ఆకలి సూచిక (GHI)నివేదిక ప్రకారం… మొత్తం 122 దేశాల జాబితాలో భారతదేశం వందో స్థానంలో నిలిచింది. ఈ స్థానాన్ని భారత్, ఇథియోపియాతో పంచుకుంది. ఐదేళ్లలోపు పిల్లలలో దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరు వారి ఎత్తుకు తగ్గ బరువు లేరు. ఈ రెండు దేశాలు 24.1 స్కోరును నమోదు చేసి ‘తీవ్రమైన’ ఆకలి వర్గంలో చోటు సంపాదించుకున్నాయి. దీర్ఘకాలంలో కొన్ని సూచికలు మెరుగుపడినప్పటికీ, దేశంలో పోషకాహార సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
నివేదికలోని ముఖ్యాంశాలు
పోషకాహార లోపం: భారతదేశ జనాభాలో 9.8 శాతం మంది తగిన పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్నారు.
ఎదుగుదల లోపం (Stunting): ఐదేళ్లలోపు పిల్లలలో 29.3 శాతం మంది వయసుకు తగిన ఎత్తు పెరగలేదు.
క్షీణత (Wasting): ఐదేళ్లలోపు పిల్లలలో ప్రతి ఐదుగురిలో దాదాపు ఒకరు (19%) తమ ఎత్తుకు తగిన బరువు లేకుండా క్షీణతతో బాధపడుతున్నారు.
శిశు మరణాలు:ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2.7 శాతంగా ఉంది.
భారతదేశ స్కోరు (24.1) ప్రపంచ సగటు (18.1), దక్షిణాసియా ప్రాంతీయ స్కోరు (23.5) కంటే ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. GHI నిబంధనల ప్రకారం, అధిక స్కోరు మరింత తీవ్రమైన ఆకలి పరిస్థితిని సూచిస్తుంది.
దక్షిణాసియా దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే…
బంగ్లాదేశ్ (19.2), నేపాల్ (14.5), శ్రీలంక (10.2) దేశాలు మెరుగైన స్కోరు సాధించి ‘మితమైన’ ఆకలి వర్గంలో నిలిచాయి. ఇవి భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.
అయితే, ఆఫ్ఘనిస్తాన్ (28.6), పాకిస్తాన్ (25.5) దేశాలు భారత్ కంటే ఎక్కువ ఆకలి స్కోరును (అంటే అధ్వాన్నమైన స్థితిని) నమోదు చేశాయి.
తగినంత డేటా అందుబాటులో లేకపోవడంతో భూటాన్, మాల్దీవులను ఈ సూచిక నుంచి మినహాయించారు.
ప్రపంచ ఆకలి సూచిక ప్రధానంగా నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది:
- జనాభాలో పోషకాహార లోపం శాతం
- ఐదేళ్లలోపు పిల్లలలో ఎదుగుదల లోపం
- ఐదేళ్లలోపు పిల్లలలో బక్కచిక్కిపోవడం
- ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు.
ఇందులో పోషకాహార లోపం, శిశు మరణాలకు ఒక్కొక్కదానికి 1/3 వంతు వెయిటేజీ, పిల్లల ఎదుగుదల లోపం, బక్కచిక్కిపోవడానికి ఒక్కొక్కదానికి 1/6 వంతు వెయిటేజీని కేటాయిస్తారు.
కాగా, ఈ సూచికను జర్మన్ సహాయ సంస్థ వెల్ట్హంగర్హిల్ఫ్ (WHH), ఐరిష్ సంస్థ, కన్సర్న్ వరల్డ్‌వైడ్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ (IFHV) సంయుక్తంగా ప్రచురించాయి. ఈ చొరవలో ‘హెల్వెటాస్’ కూడా భాగస్వామిగా ఉంది. ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఆకలిని పర్యవేక్షించడం, ఆహార భద్రతపై అవగాహన కల్పించడం ఈ సంస్థల ప్రధాన ఉద్దేశం.
ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే…2000 సంవత్సరం నుండి నమోదైన దీర్ఘకాలిక పురోగతికి అంతరాయం కలిగిస్తూ, 2018తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య మరింత తీవ్రమైందని 2026 నివేదిక హెచ్చరించింది. అలాగే, గత నివేదికల స్కోర్లతో ప్రస్తుత వాటిని నేరుగా పోల్చకూడదని సూచించింది.

