హైదరాబాద్: ఎల్ నినో ప్రభావంతో లోటు రుతుపవనాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఒకప్పుడు ఇళ్లలో కుళాయి తిప్పగానే వచ్చే నీరు, నేడు కంటిమీద కునుకు లేకుండా చేసే ఒక సుదీర్ఘ నిరీక్షణగా మారింది. ప్రాథమిక హక్కుగా ఉండాల్సిన నీరు, ఇప్పుడు ఖరీదైన వాణిజ్య వస్తువుగా మారుతూ సామాన్య ప్రజల ఇండి బడ్జెట్‌ను రెట్టింపు చేస్తోంది.
పాతాళానికి చేరిన భూగర్భ జలాలు… అధికారిక జలసంబంధ అంచనాల ప్రకారం.. కేవలం ఒక్క సంవత్సరంలోనే నగరంలో భూగర్భ జలమట్టాలు 6.85 మీటర్లకు పైగా పడిపోయాయి. ఒకప్పుడు కేవలం 60 అడుగుల లోతులోనే నీటిని అందించిన ఇళ్లలోని బోర్‌వెల్స్, నేడు 600 అడుగుల లోతుకు వెళ్లినా పూర్తిగా ఎండిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవంక జలాశయాల్లో తరిగిపోతున్న నీటి మట్టాలను రక్షించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) నీటి సరఫరా షెడ్యూళ్లలో కోత విధించింది. ఒక రోజు విడిచి ఒక రోజు ఇవ్వాల్సిన నీటిని, అనేక ప్రాంతాలలో మూడు రోజులకు ఒకసారికి కుదించారు.
* బోరబండ, పర్వత్‌నగర్, పద్మావతి నగర్ వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో కుళాయిల పీడనం తగ్గిపోయి, నీటి ప్రవాహ సమయం కేవలం 30 నిమిషాలకు పరిమితమైంది.
* జూబ్లీ హిల్స్, సైదాబాద్, రెహమత్ నగర్, గాయత్రీ నగర్ వంటి ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఐటీ కారిడార్‌లోని హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటడంతో పైప్‌లైన్లలో పీడనం తగ్గి నీటి కొరత తీవ్రమైంది.
మహిళల వేదన...ఈ నీటి సంక్షోభం తాలూకు అసలు భారం శ్రామిక, మధ్యతరగతి మహిళలపైనే పడుతోంది. అనిశ్చితంగా మారిన నీటి సరఫరా వేళల కోసం వారు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. “మాకు ఒకప్పుడు రోజు విడిచి రోజు నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతి మూడో రాత్రి కేవలం 30 నిమిషాలు మాత్రమే నీరు వస్తోంది. కనీసం వంట పాత్రలు నింపుకోవడానికి కూడా అర్ధరాత్రులు నిద్ర త్యాగం చేయాల్సి వస్తోందని” బోరబండ నివాసి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నగరవాసి ఈ నీటి ఎద్దడి తాలూకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జూబ్లీ హిల్స్ వాసి గాయత్రి కూడా పేర్కొన్నారు.
నీటి మాఫియా కబంధ హస్తాల్లో నగరం... వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో పాటు నగరంలో పుట్టుకొచ్చిన నీటి మాఫియా అక్రమ దందాలతో హైదరాబాద్‌ను మరింతగా ఎండగడుతున్నాయి. ప్రజల నీటి అవసరాలను వ్యాపారంగా మలుచుకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
