Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

భారతదేశంలో పెరుగుతున్న ఆహార ధరలు!

Share It:

న్యూఢిల్లీ: భారతదేశంలో ఆహార ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.97 శాతం ఉండగా, సెప్టెంబర్‌లో అది 7.74 శాతానికి చేరుకుంది. అదే సమయంలో, ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతం నుండి 5.54 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 3.48 శాతంగా ఉన్నప్పటి నుండి ప్రతి నెలా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పుడు 23 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన ఆరు శాతం గరిష్ట పరిమితికి దగ్గరగా ఉంది.

ఉల్లిపాయల ధరలు గత ఏడాదితో పోలిస్తే 108.09 శాతం అధికంగా ఉన్నాయి, ఆగస్టులో ఇది 48.78 శాతంగా ఉంది. వెల్లుల్లి ధరలు 54.62 శాతం, అల్లం 62.85 శాతం మరియు నిమ్మకాయల ధరలు 36.41 శాతం పెరిగాయి. అయినప్పటికీ, బంగాళాదుంపల ధరలు 11.50 శాతం, టమాటాల ధరలు 8.62 శాతం తగ్గాయి.

ఒక సంవత్సరం ఒక రకం పంటకు అధిక ధరలు వచ్చినప్పుడు, రైతులు మరుసటి సంవత్సరం అదే పంట సాగును విస్తరిస్తారు, దీనివల్ల అధిక ఉత్పత్తి ఏర్పడి ధరలు పడిపోతాయి. దానికి ప్రతిస్పందనగా, ఈసారి అన్నదాతలు ఉత్పత్తిని తగ్గిస్తారు, ఇది మళ్లీ కొరతకు, ధరల పెరుగుదలకు దారితీస్తుంది. నిల్వ, రవాణా, మార్కెట్ అందుబాటు, ధరల సమాచారాన్ని మెరుగుపరచడం ద్వారా వీటిని తగ్గించవచ్చు, రైతుల ఆదాయాలను స్థిరీకరించవచ్చు. వినియోగదారులకు ఆహార ధరలను మరింత అందుబాటులో ఉంచవచ్చు.

మరో వంక కృత్రిమ కొరత ప్రమాదం పొంచి ఉంది. ధరలు పెరగడం ప్రారంభమైనప్పుడు, కొంతమంది వ్యాపారులు సరుకును నిల్వ చేసి, ఎక్కువ సంపాదించడానికి దానిని నెమ్మదిగా విడుదల చేస్తారు.

ఈ ధరల పెరుగుదల ప్రభావం సమాజంలోని అందరికీ సమానంగా లేదు. సెప్టెంబర్‌లో నగరాల్లో ద్రవ్యోల్బణం 4.88% ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 6.08%గా నమోదైంది. పేద కుటుంబాలు తమ సంపాదనలో ఎక్కువ భాగం ఆహారంపైనే వెచ్చిస్తాయి కాబట్టి, ఈ ధరల పెరుగుదల వారిపై తీవ్రమైన భారాన్ని మోపుతోంది. రోజువారీ కూలీకి వెళ్లే వ్యక్తికి ఉల్లి ధరలు రెట్టింపు కావడం అనేది వారి జీవన ప్రమాణాలను నేరుగా దెబ్బతీస్తుంది.

ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ నిర్దేశిత పరిధిలోనే ఉన్నప్పటికీ, వరుసగా ఆరు నెలల పాటు ధరలు పెరుగుతుండటం హెచ్చరిక సంకేతం. రాబోయే కాలంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం అనేది శీతాకాలపు పంట దిగుబడిపై, అలాగే రైతులు, వ్యాపారులు, కుటుంబాల ఆర్థిక నిర్ణయాలను గమనిస్తూ ప్రభుత్వం తీసుకునే సకాల విధానాల పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.