హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. ఈమేరకు చౌటుప్పల్ పోలీసులతో కలిసి ఎస్‌టిఎఫ్ బృందం, ముఠా నాయకుడిగా భావిస్తున్న వ్యక్తితో సహా ఐదుగురిని అరెస్టు చేసింది.
న్యూ హఫీజ్‌పేట్‌లోని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న భాస్కర్ హజారికా ఇంటికి అస్సాం నుంచి ఇద్దరు కొరియర్లు గంజాయిని అందించడానికి వచ్చారనే సమాచారం మేరకు, ఈ బృందం ఆ ఐదుగురిని పట్టుకుంది.
హజారికాతో పాటు అరెస్టు అయిన వారిని ఆశిష్ కుమార్, దేబాసిస్ నాయక్ అలియాస్ పింకు నాయక్, బాబు బోరా, నిర్మల్ హజారికాగా గుర్తించారు. వారి నుంచి 24.7 కిలోల గంజాయి, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా రూ. 1.8 కోట్ల విలువైన నిషేధిత సరుకును సరఫరా చేసిందని, గంజాయికి సంబంధించిన రూ. 48 లక్షల ఆర్థిక లావాదేవీల కేసులో కూడా వీరిపై అనుమానం ఉందని నివేదికలు తెలిపాయి.
ముప్పై ఒక్క ఏళ్ల హజారికా 2014లో అస్సాం నుంచి హైదరాబాద్ వచ్చాడు. డ్రగ్స్ సరఫరాలోకి దిగకముందు, అతను కొన్నేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా, డెలివరీ బాయ్‌గా పనిచేశాడు.
2020 సంవత్సరం ప్రారంభం నుంచి, హజారికా ఒడిశా నుంచి గంజాయిని సేకరించి, దానిని చిన్న చిన్న పరిమాణాల్లో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూస్ మీటర్ కథనం ప్రకారం, అతను మాదాపూర్‌లో రెండు కేసుల్లో, గచ్చిబౌలిలో ఒక కేసులో పట్టుబడ్డాడు. అయితే, బెయిల్‌పై బయటకు వచ్చి, ఆ తర్వాత తన మోసపు పద్ధతిని మార్చుకున్నాడు.
ప్రధాన సూత్రధారి అస్సాం నుంచి సహాయకులను తెచ్చుకుని ఒక నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడని ఆ నివేదిక పేర్కొంది. అతను ఒడిశాకు చెందిన సరఫరాదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ కుమార్, దేబాసిస్ నాయక్, బాబు బోరాల నుంచి కిలోకు రూ. 12,000-15,000 చొప్పున గంజాయిని కొనుగోలు చేసేవాడు.
ఆ తర్వాత దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి, ఒక్కో ప్యాకెట్‌ను రూ. 300కు విక్రయించి, కిలోకు రూ. 45,000-50,000 వరకు సంపాదించేవాడు. హజారికా పది నెలల కాలంలో సుమారు 400 కిలోల గంజాయిని విక్రయించి, 1.8 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడని ఆ నివేదిక పేర్కొంది. బ్యాంకు రికార్డుల ప్రకారం, ఆశిష్ కుమార్ అనే వ్యక్తికి మాత్రమే 48 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయి.
కాగా,ఆగస్టు నెలలో చౌటుప్పల్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా, వారి వద్ద 20 కిలోలకు పైగా గంజాయి లభ్యమైంది. వారిని విచారించగా హజారికా పేరు బయటపడింది, కానీ అప్పటికే అతను పరారయ్యాడు.
తెలంగాణతో పాటు ఒడిశా, అస్సాం మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా హజారికా కదలికలను తమ బృందం పర్యవేక్షిస్తోందని ‘ఈగల్ ఫోర్స్’ (EAGLE Force) డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించినట్లు ‘డెక్కన్ క్రానికల్’ పేర్కొంది.

