న్యూఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయన మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, ఖేలో ఇండియా క్రీడల నిర్వహణపై చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలు ప్రాణహిత నదిపై +152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేలా చొరవ చూపాలని సీఎం రేవంత్ ప్రధానిని కోరారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో తాను జరిపిన చర్చల వివరాలను మోదీకి వివరించారు. ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు నష్టపరిహారం చెల్లించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా సాగు, తాగునీరు అందుతుందని తెలిపారు.
ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరు: డాక్టర్ ఎస్. జైపాల్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), సీతారామ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్ట్ (SSMP), దిండి ఎత్తిపోతల పథకం (DLIS)లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేసిందని సీఎం పేర్కొన్నారు. అయితే, పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో ఆశించిన ప్రయోజనాలు అందడం లేదన్నారు. పర్యావరణ అనుమతులపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పును ప్రస్తావిస్తూ, ఆలస్యం చేయకుండా ఆయా ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
SASCI కింద అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలి: రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ప్రత్యేక సహాయ పథకం (SASCI) కింద తెలంగాణకు అదనంగా రూ. 5,000 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 70 నుంచి 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధులను విడుదల చేస్తే కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఉపాధి, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని వివరించారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు – ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (CWC) సమర్పించినట్లు సీఎం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి జలాశయ మట్టం (FRL), వెనుక జలాల వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, గ్రామాలను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 9.88 కోట్లతో సమగ్ర సర్వే నిర్వహించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) ఇప్పించేందుకు సహకరించాలని కోరారు.
అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ప్రధానిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్డిసెంబర్లో హైదరాబాద్‌లో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వానించారు.
ఈ సమావేశంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.


