ముంబయి: ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తే ఒక్కో ఎంపీకి 150 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్లు ఆమోదానికి ప్రభుత్వానికి సుమారు 40 నుంచి 45 మంది ఎంపీలు బలం అవసరమని, దీన్ని అధిగమించేందుకు చిన్న పార్టీలపై ఒత్తిడి తీసుకురావడం లేదా ఎంపీలను కొనుగోలు చేయడం ద్వారా మద్దతు పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ వ్యూహాన్ని అమలు చేసే బాధ్యతను మహారాష్ట్రకు చెందిన ఒక మంత్రి తీసుకున్నారని, ఇందుకోసం నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు ఆయా పార్టీల నుంచి వచ్చే ఎంపీలకు ఒక్కొక్కరికి రూ. 150 కోట్లు అందజేస్తారని, అంతేకాకుండా వారిపై అనర్హత వేటు కూడా పడకుండా చూస్తారని రౌత్ ఆరోపించారు.
బీజేపీకి దేశం పట్ల, రాజ్యాంగం పట్ల లేదా పార్లమెంటు పట్ల ఎలాంటి గౌరవం లేదని, అందుకే పార్లమెంటు సమావేశాలను వాయిదా వేస్తోందని శివసేన (యూబీటీ) నాయకుడు విమర్శించారు.
‘ది వైర్’ కథనం ప్రకారం, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చరిత్రలోనే అత్యధిక కాలం పాటు ‘సైన్ డై’ (నిరవధిక వాయిదా)లో ఉన్నాయి. 100 రోజులు గడిచినా, సమావేశాలను అధికారికంగా ముగిస్తున్నట్లు (ప్రోరోగ్) ప్రకటించలేదు. ఈ పరిణామం, వివాదాస్పద డీలిమిటేషన్,లోక్సభ స్థానాల పెంపునకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టాలని యోచిస్తోందనే ఊహాగానాలకు దారితీసింది.
గత ఏప్రిల్లో, మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) లోక్సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేక విఫలమైంది. ఈ బిల్లు, దీనికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను 850కి పెంచడంతో పాటు, పార్లమెంటరీ సమీకరణాలను పూర్తిగా మార్చేందుకు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా, 1976లో విధించిన ‘ఫ్రీజ్’ (నియోజకవర్గాల పునర్విభజనపై నిషేధం)ను తొలగించి, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం 2027 జనాభా గణన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి.

