ఇల్లు.. ఒక మహిళకు అత్యంత భద్రతనిచ్చే ఆశ్రయంగా ఉండాలి. కానీ అదే ఇల్లు ఆమెకు మరణశాసనంగా మారుతుంటే అంతకంటే విషాదం ఏముంటుంది? ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసకు సంబంధించి ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించిన గణాంకాలు నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 47 వేల మందికి పైగా మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత భాగస్వాముల చేతుల్లో హత్యకు గురయ్యారు. అంటే సగటున ప్రతి గంటకు ఐదుగురు.. రోజుకు 129 మంది మహిళలు హత్యకు బలవుతున్నారు.
ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం (UN Women), మాదకద్రవ్యాలు, నేరాల కార్యాలయం (UNODC) సంయుక్తంగా రూపొందించిన నివేదిక మహిళల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయానక పరిస్థితిని ఆవిష్కరించింది. 2025లో ఉద్దేశపూర్వక హత్యలకు గురైన మహిళలు, బాలికల్లో సుమారు 60 శాతం మంది కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత భాగస్వాముల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. పురుషుల హత్యల్లో కుటుంబ పరిధిలో జరిగినవి కేవలం 11 శాతం మాత్రమే. ఈ వ్యత్యాసం మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన ప్రమాదాన్ని స్పష్టం చేస్తోంది.
మహిళలకు రక్షణ కల్పించాల్సిన కుటుంబ వ్యవస్థలోనే హింస పెచ్చరిల్లడం సామాజిక వైఫల్యానికి నిదర్శనం. పురుషాధిక్య భావజాలం, లింగ వివక్ష, మహిళల స్వేచ్ఛను నియంత్రించాలనే ఆధిపత్య ధోరణి, గృహహింసను సాధారణ విషయంగా పరిగణించే సామాజిక దృక్పథం ఈ విషాదానికి ఆజ్యం పోస్తున్నాయి. హింసను ముందుగానే గుర్తించడం, బాధితులకు రక్షణ కల్పించడం, నేరస్థులకు కఠిన శిక్షలు విధించడం వంటి చర్యలు ఇంకా సమర్థంగా అమలుకావాల్సి ఉంది.ప్రాంతాలవారీగా చూస్తే ఆఫ్రికాలో మహిళల హత్యలు అత్యధికంగా నమోదయ్యాయి. ఆసియా రెండో స్థానంలో ఉంది. మహిళలపై హింసకు భౌగోళిక సరిహద్దులు లేవని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
మహిళల భద్రత అంటే కేవలం చట్టాలు చేయడం కాదు. కుటుంబాల్లో సమానత్వ భావనను పెంపొందించడం, బాల్యం నుంచే లింగ సమానత్వ విలువలను నేర్పించడం, గృహహింసపై మౌనం వీడే సామాజిక వాతావరణాన్ని నిర్మించడం అవసరం. బాధితురాలినే నిందించే ధోరణికి స్వస్తి పలకాలి. ఫిర్యాదు చేసిన ప్రతి మహిళకు న్యాయం, రక్షణ అందాలి. ఒక మహిళ ప్రాణం కోల్పోయిన తర్వాత స్పందించడం కంటే, ఆమెపై హింస మొదలైనప్పుడే సమాజం మేల్కొనాలి. నాలుగు గోడల మధ్య జరిగే హింసను వ్యక్తిగత కుటుంబ వ్యవహారంగా చూడటం మానేసినప్పుడే మహిళలకు నిజమైన భద్రత సాధ్యమవుతుంది. మహిళకు ఇల్లు ఆశ్రయం కావాలి.. అంతిమ గమ్యం కాదు!


